టి20 ప్రపంచకప్ బాయ్ కాట్.. బంగ్లాకు ఓటేసిన ఆ ఒకే ఒక్క దేశం
టి20 ప్రపంచ కప్ మరొక్క రెండు వారాలే గడువుంది. ఈ సమయంలో మెగా టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందా? లేదా? అన్న అంశం తేలిపోయింది.;
టి20 ప్రపంచ కప్ మరొక్క రెండు వారాలే గడువుంది. ఈ సమయంలో మెగా టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందా? లేదా? అన్న అంశం తేలిపోయింది. దొంగ సాకులు చూపించి తమ మ్యాచ్ లను భారత్ లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. కానీ, వెళ్తే భారత్ కు వెళ్లండి.. లేదంటే లేదు అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అని తేల్చిచెప్పింది. బంగ్లా మ్యాచ్ ల మార్పు విషయమై 16 సభ్య దేశాల తో ఓటింగ్ నిర్వహించింది. ఇందులో బంగ్లా కాకుండా దానికి మద్దతుగా నిలిచింది ఒకే ఒక్క దేశం. మిగతా 12 వ్యతిరేకంగానే ఓటేశాయి. దీంతో ఐసీసీ తన నిర్ణయం ఖరాకండిగా చెప్పేసింది. మరి బంగ్లాదేశ్ కు వంత పాడుతూ ఓటేసిన ఆ దేశం ఏది..? అనేది అభిమానులకు తెలియాల్సి ఉంది. కాగా, టి20 ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ భారత్ లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ లు రెండు వేదికల్లో జరగనున్నాయి. ఒకటి ఆ దేశానికి చాలా దగ్గరగా ఉండే కోల్ కతా, మరోటి ముంబై. భద్రత పరంగా ప్రధాన నగరాలు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినా కూడా బంగ్లాదేశ్ తమ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పించినందుకు భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. వాస్తవానికి బంగ్లాలో హిందువుల హత్యల నేపథ్యంలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతల రీత్యానే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బంగ్లాకు మాత్రం వేరే విధంగా అర్థం అయింది.
తోక ముడవాల్సిందే..
ముస్తాఫిజుర్ ను తప్పించినందుకు ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది బంగ్లాదేశ్. ఇది ఆ దేశానికే దెబ్బ. ఇప్పుడు భారత్ లో మ్యాచ్ లు ఆడడం తప్ప మరో దారి లేదు. భారత్ లో ఆ దేశపు జట్టు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ తేల్చింది. దీంతో బంగ్లాదేశ్ కు మరో దారి లేకుండాపోయింది. ఒకవేళ అప్పటికీ టోర్నీకి రాకుంటే.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ను ఆడించే చాన్సుంది. అంతేకాదు.. మ్యాచ్ ల తరలింపు అనేది తమ ప్రతిష్ఠకు ముడిపడి ఉందని, దీనిని ఒప్పుకొంటే ఐసీసీ టోర్నీలకు విలువ లేకుండా చేస్తుందని అంటోంది. ఇప్పుడు బంగ్లా గనుక భారత్ కు రాలేదంటే దాని బతుకు లేనట్లే.
బంగ్లాతో పాటు ఆడిద్దామని..
బంగ్లాదేశ్ తరహాలోనే తాము కూడా టి20 ప్రపంచకప్ పై భారత్ ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూసింది పాకిస్థాన్. కానీ, తర్వాత అబ్బే అదేమీ లేదంటూ దాటవేసింది. అయితే, బుధవారం జరిగిన పరిణామాల్లో బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ మద్దతుపలికింది. 14 దేశాల ఓటింగ్ లో బంగ్లాకు ఓటేసిన ఏకైక దేశం పాకిస్థానే కావడం గమనార్హం. తద్వారా భారత్ పట్ల ద్వేషం, శత్రుత్వంతో తన బుద్ధి చాటుకుంది.
జేబుకు చిల్లు..
ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్ లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లా గనుక ఈ టోర్నీలో ఆడకుంటే ఐసీసీ చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే. టి20 ప్రపంచకప్ ద్వారా వచ్చే డబ్బులు ఇవ్వకుండా, జరిమానా కూడా విధించే చాన్సుంది. ఇక తర్వాత స్పాన్సర్ షిప్ లు, ఆదాయం పడిపోతుంది. కాంట్రాక్టులు కూడా రావు.