అలాగైతే గంభీర్ సింహాచ‌లం అప్ప‌న్న ఆల‌యానికి వెళ్ల‌డ‌మూ త‌ప్పే!

ఇటీవ‌లి కాలంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు స్వ‌దేశంలో సిరీస్ ల సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం అల‌వాటుగా చేసుకున్నారు.;

Update: 2026-03-11 11:56 GMT

ఇటీవ‌లి కాలంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు స్వ‌దేశంలో సిరీస్ ల సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం అల‌వాటుగా చేసుకున్నారు. కొద్ది రోజుల కింద‌ట విశాఖ‌ప‌ట్నంలో మ్యాచ్ ల కోసం వ‌చ్చి.. సింహాచ‌లం అప్ప‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకున్నారు. అక్క‌డి క‌ప్ప స్తంభాన్ని ఆలింగ‌నం చేసుకున్నారు. ఇలానే తాజాగా టి20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక హ‌నుమంతుడి ఆల‌యానికి వెళ్లారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆదివారం న్యూజిలాండ్ తో టి20 ప్రపంచ క‌ప్ ఫైన‌ల్ జ‌రిగింది గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ లో. టైటిల్ సాధించిన త‌ర్వాత హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ తో క‌లిసి ప్ర‌పంచ క‌ప్ తో గుడికి వెళ్లారు కొందరు క్రికెట‌ర్లు. అయితే, మిగ‌తావారు ఎలా ఉన్నా, మాజీ క్రికెట‌ర్ కీర్తి ఆజాద్ కూడా దీనిని విమ‌ర్శించారు. సోష‌ల్ మీడియాలోనైతే కొంద‌రు మ‌త ప్ర‌స్తావ‌న తెస్తూ.. ఫ‌లానా క్రికెట‌ర్లు వారి వారి ప్రార్థ‌నా మందిరాల‌కు వెళ్లారా? అని కూడా కామెంట్లు పెట్టారు. కానీ, కీర్తి ఆజాద్ వ్యాఖ్య‌లు మాత్రం గంభీర్ ప‌రిశీల‌న‌కు వెళ్లాయి.

అస‌లే ముక్కుసూటి.. ఆపై విజ‌య సంబరం

గౌత‌మ్ గంభీర్ ది ముక్కుసూటి మ‌న‌స్త‌త్వం. అలాంటివాడు తాజాగా ప్ర‌పంచ క‌ప్ గెలిచాక ఇక ఎలా ఉంటాడు? అందుక‌నే కీర్తి ఆజాద్ వ్యాఖ్య‌ల‌ను స‌మాధానం ఇచ్చేంత స్థాయి లేని ప్ర‌శ్న అంటూ కొట్టిపారేశాడు. విశ్వ విజేత‌గా దేశం గ‌ర్వ‌ప‌డే క్ష‌ణంలో ఇలాంటి వ్యాఖ్య‌లు ఏమిటి? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. పైగా ఇలాంటి స్టేట్ మెంట్లు 15 మంది క్రికెట‌ర్లు సాధించిన ఘ‌న విజ‌యాన్ని త‌క్కువ చేసుకోవ‌డమేన‌ని అన్నాడు.

కుర్రాళ్ల‌ను సెల‌బ్రేట్ చేసుకోనివ్వాలి..

కుర్రాళ్లు సాధించిన ఘ‌న‌త‌ను ఇష్ట‌మైన విధంగా సెల‌బ్రేట్ చేసుకునే చాన్స్ ఇవ్వాల‌ని గంభీర్ సూచించాడు. ఎలాంటి మత‌, రాజ‌కీయ విభేదాలు ఉండొద్ద‌ని ప‌రోక్షంగా గుడి ప్ర‌స్తావ‌న‌ను ఖండించాడు. ద‌క్షిణాఫ్రికాపై సూప‌ర్ 8 తొలి మ్యాచ్ లో దారుణంగా ఓడాక పుంజుకొని చాంపియ‌న్ గా నిలిచిన ఆట‌గాళ్ల క‌ష్టాన్ని త‌క్కువ చేయొద్దంటూ గంభీర్ పేర్కొన్నాడు. కీర్తి ఆజాద్ వ్యాఖ్య‌లు.. సొంత జ‌ట్టునే కుంగ‌దీసిన‌ట్లు అని కూడా నిప్పులు చెరిగాడు. కాగా, కీర్తి ఆజాద్ వ్యాఖ్య‌లు కొంత అసమంజ‌స‌మే.. అనే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. గంభీర్ జ‌ట్టుతో గ‌తంలో సింహాచ‌లం ఆల‌యానికి కూడా వెళ్లిన సంగ‌తిని గుర్తుచేస్తున్నారు.

Tags:    

Similar News