టి20 ప్రపంచక‌ప్.. బంగ్లా..పాక్.. మొహం ఎక్క‌డ పెట్టుకుంటాయి?

భార‌త్ పై పుట్టుక‌తోనే ద్వేషం పెంచుకున్న పాకిస్థాన్.. క్రికెట్ లో బంగ్లాను కూడా త‌ప్పుదారి ప‌ట్టిస్తోందా? అంటే ఔన‌నే చెప్పాలి.;

Update: 2026-03-09 04:49 GMT

ప‌క్క‌నున్న భార‌త్ అన్ని రంగాల్లో ఎదిగిపోతోంద‌నే క‌డ‌పు మంట‌నో... క్రికెట్ లో టీమ్ఇండియా దూసుకెళ్తోంద‌నే దుగ్ధ‌తోనో... పొరుగు దేశాన్ని ప్రపంచం ముందు ప‌లుచ‌న చేయాల‌నే అక్క‌సుతోనో.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు ఒక‌టే ఏడుపు..! ఇది టి20 ప్రపంచ క‌ప్ ముంగిట స్ప‌ష్టంగా క‌నిపించింది. సొంత దేశంలో హిందువుల‌పై దాడులు జ‌రుతుంటే ఆప‌లేని బంగ్లా.. వారి క్రికెట‌ర్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి త‌ప్పించార‌నే క‌క్ష‌తో ఏకంగా టి20 ప్ర‌పంచ క‌ప్ బ‌హిష్క‌రించింది. అస‌లు వారికి ఏ స‌మ‌స్య లేక‌పోయినా భార‌త్ లో కాదు త‌మ మ్యాచ్ లు మ‌రో ఆతిథ్య దేశం శ్రీలంక‌లో నిర్వ‌హించాల‌నే పిచ్చి డిమాండ్ ను స‌రిగ్గా క‌ప్ ప్రారంభ స‌మ‌యానికి కొద్ది రోజుల ముందు లేవ‌నెత్తింది. ఇది సాధ్యం కాద‌ని తెలిసినా మంకుప‌ట్టుకు పోయి ఒక పెద్ద టోర్నీ నుంచి త‌ప్పుకొని చెడ్డ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ లో పెద్ద‌న్న భార‌త్. అలాంటి దేశ‌పు జ‌ట్టుతో ఒక్క సిరీస్ ఆడినా చాల‌ని చాలా చిన్న జ‌ట్లు భావిస్తాయి. త‌మ‌కు నాలుగు డ‌బ్బులు వ‌స్తాయ‌ని కూడా ఆశ‌ప‌డ‌తాయి. దీనికి ఉదాహ‌ర‌ణ‌.. శ్రీలంక‌నే. బంగ్లా మాత్రం మొండికి పోయి మొద‌టికే మోసం తెచ్చుకుంది.

పాక్ ఎగ‌దోసిందా?

భార‌త్ పై పుట్టుక‌తోనే ద్వేషం పెంచుకున్న పాకిస్థాన్.. క్రికెట్ లో బంగ్లాను కూడా త‌ప్పుదారి ప‌ట్టిస్తోందా? అంటే ఔన‌నే చెప్పాలి. టి20 ప్రపంచక‌ప్ నుంచి బంగ్లా వైదొల‌గేలా ఎగ‌దోసింది పాకిస్థానే అని అనుమానాలు వ‌స్తున్నాయి. దీనికి ఉదాహ‌ర‌ణ‌.. బంగ్లా మ్యాచ్ ల‌ను భార‌త్ నుంచి త‌ప్పించ‌కుంటే తాము ప్రపంచక‌ప్ లో భార‌త్ తో ఆడేది (లంక‌లో మ్యాచ్ లు నిర్వ‌హించినా స‌రే) లేద‌ని పాక్ భీష్మించింది. చివ‌ర‌కు కాళ్ల బేరానికి వ‌చ్చి ఆడింది.. దారుణంగా ఓడింది. కానీ, బంగ్లాను మాత్రం ముంచింది.

బంగ్లా.. లంక అభిమానులతో వైరం మ‌రిచి..

అస‌లు త‌మ మ్యాచ్ ల‌ను లంక‌కు త‌ర‌లించాల‌న్న బంగ్లా వాద‌నే స‌రికాదు. ఎందుకంటే, వారికి శ్రీలంక అభిమానులు అస‌లు మ‌ద్ద‌తివ్వ‌రు. 2018లో జ‌రిగిన సిరీసే దీనికి ఉదాహ‌ర‌ణ‌. ఓసారి త‌మ జ‌ట్టుపై గెలిచాక బంగ్లా క్రికెట‌ర్లు చేసిన నాగిని డ్యాన్స్ వెట‌కారాన్ని లంక అభిమానులు మ‌ర్చిపోలేదు. దీనిని ప‌ట్టుకుని బంగ్లా ఆట‌గాళ్లను చాలాసార్లు గేలి చేశారు. ఇదంతా మ‌ర్చిపోయిన బంగ్లా త‌మ మ్యాచ్ లు లంక‌లో ఆడ‌తామ‌ని డాంబికాలు పోయి మొహం ప‌గుల‌కొట్టుకుంది.

భ‌విష్య‌త్ లో బంగ్లాకు చుక్క‌లే..

టి20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక చూస్తే.. ఇప్పుడు భార‌త్ విశ్వ‌విజేత‌.. బంగ్లా అస‌లు టోర్నీలోనే లేదు. పాక్ సూప‌ర్ 8లోనే ఔట్ అయింది. అనేక రికార్డుల‌ను కొల్ల‌గొడుతూ.. టీమ్ఇండియా జ‌గ‌జ్జేత‌గా ఆవిర్భ‌విస్తే.. బంగ్లాతో భ‌విష్య‌త్ లో సిరీస్ లు కూడా ఆడ‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు చెప్పాలి.. పాక్-బంగ్లా మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటాయ‌ని..?

Tags:    

Similar News