దావోస్ టూర్...బాబు మార్క్ రికార్డు
ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36 కు పైగా కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో మూడు కీలక సమావేశాలు నిర్వహించారు.;
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కి ప్రతీ ఏటా వెళ్తూ ఉంటారు. ఇది ఆయన గత పాతికేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఏ రోజూ దావోస్ టూర్ ని మిస్ చేయలేదు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని విదేశీ వ్యాప్తంగా చాటడం పెట్టుబడులు ఆకర్షించడం అన్నది బాబు విధానంగా ఉంటూ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 18న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ కి వెళ్ళి అక్కడ నుంచి దావోస్ కి ప్రయాణం అయిన చంద్రబాబు నాలుగు రోజుల పాటు దావోస్ లో ఫుల్ బిజీగా గడిపారు. ఆయన ఎంతో మంది దేశ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు వేశారు. అలాగే విదేశీ ప్రముఖులతో ఆయన సమావేశాలు జరిపి ఏపీ ప్రభుత్వ పాలసీల గురించి వారికి సోదాహరణంగా వివరించారు.
మొత్తం షెడ్యూల్ లో :
ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36 కు పైగా కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో మూడు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీ అభివృద్ధికి ఆయా దేశాల సాయం కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించి ఏపీలో ప్రాజెక్టుల గురించి వారితో చర్చించారు. అదే విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన తొమ్మిదికి పైగా సెషన్స్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.
గత ఏడాది పెట్టుబడులు :
ఇదిలా ఉంటే 2025లో జరిపిన దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని చంద్రబాబు చెప్పారు ఈసారి దాని కంటే కూడా బాగా టూర్ సాగిందని అన్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని బాబు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను వనరుల్ని సమర్ధంగా వివరించగలిగామని బాబు వెల్లడించారు.
ఏపీ బ్రాండ్ విస్తరణ :
దావోస్ తాజా టూర్ తో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని బాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా సదస్సు దోహదం చేసిందని ఆయన పేర్కొనడం విశేషం. ఇక చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఆయన అక్కడ నుంచి గురువారం భారత్ కి బయల్దేరారు. శుక్రవారం ఉదయం 8.25 నిముషాలకు హైదరాబాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి అమరావతికి బయల్దేరుతారని అనంతరం అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాలలో బాబు పాల్గొంటారని చెబుతున్నారు.