అమెరికాలో ఇండియన్స్ పెడుతున్న ఖర్చు చూస్తే మతిపోతుంది
ఇండియా నుంచి అమెరికా వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికా టూరిజం రెవెన్యూలో మనది రెండో స్థానం.;
ఇండియా నుంచి అమెరికా వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికా టూరిజం రెవెన్యూలో మనది రెండో స్థానం. ఇది ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని బ్రాండ్ యూఎస్ఏ ప్రెసిడెంట్, సీఈవో ఫ్రెడ్ డిక్సన్ తెలిపారు. విదేశీ పర్యటనల పట్ల భారతీయులు చూపుతున్న ఆసక్తి , వారు చేస్తున్న ఖర్చు.. వారి అభివృద్ధిని సూచిస్తోందని పేర్కొన్నారు. 2019 నుంచి దాదాపు 40 శాతం పర్యాటకుల తాకిడి అమెరికాకు పెరిగినట్టు డిక్సన్ తెలిపారు. అమెరికాకు వస్తున్న భారతీయుల సంఖ్య పెరగడం తమకెంతో ఆనందాన్నిస్తోందని చెప్పారు. 2025లో భారీ స్థాయిలో భారతీయులు అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని డిక్సన్ ప్రస్తావించారు. దాదాపు 20 లక్షల మంది అమెరికా పర్యటనకు వెళ్లినట్టు తెలిపారు. ఇది ఇండియన్ టూరిస్ట్ మార్కెట్ కు ఉన్న బలాన్ని సూచిస్తోందన్నారు. న్యూయార్క్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని డిక్సన్ పేర్కొన్నారు.
ఇండియన్స్ ఖర్చే ఎక్కువ ..
2025తో పోల్చితే 2026లో భారత పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని డిక్సన్ వెల్లడించారు. వచ్చే వేసవిలో జూన్, జులైలో ఫిఫా వరల్డ్ కప్ జరిగే విషయాన్ని ప్రస్తావించారు. సియాటిల్ నుంచి మియామి వరకు 11 సిటీలలో 48 టీమ్స్ పోటీ పడబోతున్నాయని డిక్సన్ తెలిపారు. అదే విధంగా అమెరికా 254 వార్షికోత్సవం కూడా జరగబోతుందని చెప్పారు. దీంతో పాటు అమెరికాలోని ప్రముఖ హైవే రూట్ 66 వార్షికోత్సవం కూడా జరుగుతుందని డిక్సన్ తెలిపారు. ఈ కార్యక్రమాలు అమెరికా పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. ఇండియా నుంచి ఎక్కువ మంది పర్యాటకులు రావడమే కాదు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో 2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్, 2031లో జరగబోయే రగ్బీ వరల్డ్ కప్, 2034లో జరిగే వింటర్ ఒలంపిక్స్ ధీర్ఘకాలంలో పర్యాటక రంగాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాలు అవుతాయని పేర్కొన్నారు.
అమెరికా డ్రీమ్ ..అప్పుడు ఇప్పుడు !
ఇండియన్స్ లో దశాబ్ధాల నుంచి అమెరికన్ డ్రీమ్ ఉంది. అమెరికాలో ఉద్యోగం చేయాలని, సంపాదించాలని, స్థిరపడాలని, వ్యాపారం చేయాలని. ఇలా ఎన్నో రకాల కలలతో అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడటం, ఉద్యోగం కోసమే కాకుండా చూసి వద్దామనే వారి సంఖ్య పెరుగుతోంది. అధికారిక డేటా చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. అమెరికాకు పర్యాటక ఆదాయం సమకూర్చడంలో ఇండియన్స్ స్థానం రెండోది. అంటే ఏ స్థాయిలో అమెరికాకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉండటం.. ఇండియన్స్ ఆర్థిక శక్తిని కూడా సూచిస్తుంది. తగిన సంపాదన ఉంటేనే అమెరికా లాంటి అగ్రదేశాల్లో పర్యటించగలరు. కాబట్టే అమెరికాకు ఇప్పుడు ఇండియన్స్ చాలా అవసరం. వారి ఆదాయం మనతో ముడిపడి ఉంది. అందుకే అమెరికా ఇండియాతో జాగ్రత్తగా మసులుకుంటోంది.