ఏఐ రాకుంటే ఫెయిల్.. ఐదేళ్ల క్రితంలా కాదు !
ప్రతి ఆవిష్కరణ.. చరిత్రగా మారిపోతోంది. పాతది అంతరించి కొత్తదానికి పురుడు పోస్తోంది.;
ప్రతి ఆవిష్కరణ.. చరిత్రగా మారిపోతోంది. పాతది అంతరించి కొత్తదానికి పురుడు పోస్తోంది. ఒకప్పుడు కోడింగ్ నేర్చుకున్నవారికే ఉద్యోగం. ఇప్పుడు ఏఐ పై అవగాహన ఉన్న వారికే ఉద్యోగం. ఈ పరిస్థితి టెక్ రంగంలో వస్తున్న నిరంతర మార్పునకు అద్దం పడుతోంది. మార్పును ఒంటబట్టించుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు. లేదంటే ఉన్నచోటే ఉండిపోతున్నారు. లేదా నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పుడు ఎక్కడా చూసినా కృత్రిమ మేధ (ఏఐ)పైనే చర్చ. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయంటూ కొందరు. ఉద్యోగాలు వస్తాయంటూ ఇంకొందరు. లేదు.. లేదు.. ఉద్యోగుల పని సులభం అవుతుందని మరికొందరు. ఇలా ఏఐపైన చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదంతం వార్తలకెక్కింది.
సీనియర్ ఇంజినీర్ ఫెయిల్.. !
ఆకాశ్ విశాల్. గూగుల్, అమెజాన్, స్ప్లంక్, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ కంపెనీల్లో సీనియర్ ఇంజనీరు. సిలికాన్ వ్యాలీకి చెందిన స్టార్టప్ కంపెనీ 2024లో ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూకు ఆకాశ్ విశాల్ హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద కోడ్ బేస్ ను డీబగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఏఐ టూల్స్ వాడొచ్చని చెప్పింది. కానీ ఆకాశ్ విశాల్ ఏఐ వాడకుండా, తన సొంత నైపుణ్యాన్ని ఉపయోగించారు. దీంతో ఆకాశ్ ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. అయితే ఆ ఇంటర్వ్యూ తనను మేల్కొలిపిందని పేర్కొన్నారు. ఎందుకంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదు. ఏఐ పై అవగాహన ఉండాలి. ఇప్పుడు కోడింగ్ ఎంత సమర్థవంతంగా ఉద్యోగులు వాడుతున్నారో కంపెనీలు పరిశీలిస్తున్నాయి. డెవలప్మెంట్ ను వేగవంతం చేయడానికి, కోడింగ్ పనులు తగ్గించడానికి, నాణ్యతను పెంచడానికి ఇంజినీర్లు ఏఐ వాడాలని కంపెనీలు ఆదేశిస్తున్నాయి.
మారితేనే ఉంటాం ..
ఈ మార్పుల కారణంగా ఇంజినీర్లు సిస్టమ్ డిజైన్, క్లిష్లమైన బిజినెస్ లాజిక్ పై దృష్టిపెడుతున్నారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం ఐదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చితే పూర్తీగా మారిపోయిందని ఆకాశ్ విశాల్ తెలిపారు. 2020లో డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్, సిస్టమ్ డిజైన్స్ లో పట్టు ఉంటే సులభంగా ఉద్యోగాలు వచ్చేవని, కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లౌడ్ నైపుణ్యాలతో పాటు `ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ` ఏఐ సహాయంతో డీబగ్గింగ్ చేయడం వంటి నైపుణ్యాలు అవసరమని ఆకాశ్ విశాల్ పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా యువత సిద్ధమైతేనే.. అవకాశాలు ఉంటాయని ఆకాశ్ ఇంటర్వ్యూ స్పష్టంగా చెబుతోంది. ఎప్పుడు సంప్రదాయ పద్ధతులను వినియోగించాలి, ఎప్పుడు ఏఐ సహాయం తీసుకోవాలన్న అంశంపై ఉద్యోగులకు ఉన్న స్పష్టతను కంపెనీలు అంచనా వేస్తున్నాయి. తర్వాతనే వారికి ఉద్యోగం ఇవ్వాలన్నా, కొనసాగించాలన్నా ఆలోచిస్తున్నాయి. కేవలం సాంకేతిక నైపుణ్యమే కాకుండా, ఏఐ ఎలా వాడుతున్నారు, ఆటోమేషన్, మానవ పర్యవేక్షణ మధ్య సమతుల్యత ఎలా పాటిస్తున్నారన్న అంశాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయని ఆకాశ్ చెప్పారు.
మార్పు మంచిదే ..
ప్రతి అంశంలోనూ మార్పు ఎప్పుడూ సహజమే. అయితే, ఆ మార్పుకు తగ్గట్టు మనిషి మారాలన్నది ఆకాశ్ విశాల్ మాటల ద్వారా అర్థం అవుతున్న అంశం. ఈరోజు కోడింగ్, ఏఐ.. రేపు ఇంకో టెక్నాలజీ. ఇలా మార్పు వస్తూనే ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు మార్పునకు తగ్గట్టు మారాలి. కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు ఏఐ ఆధిపత్యం ఉంటుంది. రేపు ఇంకో టెక్నాలజీ ఆధిపత్యం ఉంటుంది. అంతే కానీ టెక్నాలజీ జడపదార్థంలా ఉండిపోదు. మారుతూనే ఉంటుంది. అది అర్థం చేసుకుని మారితే మార్పు మంచిదే.