బిగ్ న్యూస్... ఏపీలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా దూరం..!?
ఈ నేపథ్యంలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించాలనే ఏపీ సర్కార్ చేస్తుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.;
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వినియోగం, రకరకాల పోస్టులు, అనంతరం పోలీసుల చర్యలు అనేది ఇటీవల రెగ్యులర్ అయిపోయిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుంది. విజ్ఞత మరిచి, విచక్షణ విడిచి సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారి తాట తీస్తుంది! ఈ నేపథ్యంలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించాలనే ఏపీ సర్కార్ చేస్తుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఆంధ్రప్రదేశ్ లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా విధించిన తరహా నిషేధాన్ని అధ్యయనం చేస్తోన్నట్లు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన లోకేష్.. బ్లూమ్ బెర్గ్ న్యూస్ తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒక రాష్ట్రంగా.. తాము ఆస్ట్రేలియా అండర్-16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నామని.. ఈ విషయంలో బలమైన చట్టపరమైన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానని లోకేష్ అన్నారు. ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు సోషల్ మీడియాలో ఉండకూడదని తాను గట్టిగా భావిస్తున్నానని.. ఎందుకంటే, వారు ఏమి చూస్తున్నారో వారికి అర్థం కావడం లేదని తెలిపారు!
ఈ నేపథ్యంలో ఈ విషయంపై అప్పుడే చర్చ మొదలైంది.. ఈ సందర్భంగా... ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఆన్ లైన్ లో ఉచితంగా లభించే ప్రతికూల, హానికరమైన కంటెంట్ ను అర్థం చేసుకునేంత మానసికంగా పరిణతి చెందరని.. అందుకే ఏపీప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేస్తోందని.. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా అండర్-16 సోషల్ మీడియా చట్టాన్ని పరిశీలిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి ఈ విషయంపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కేంద్రానికి సూచించింది. ఎస్ విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.