కౌంట్ డౌన్.. అమరావతికి చట్టబద్ధత!
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.;
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. గత 2015-18 మధ్య రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనే భూసమీకరణ కూడా జరిగిం ది. అయితే.. వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడం.. అమరావతిపై రాజకీయ ముద్ర వేయడం రైతులను హింసించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మూడు రాజధానులు అంటూ వైసీపీ పాడింది.
ఈ క్రమంలో గత 2019-24 మధ్య అమరావతి వ్యవహారం అటకెక్కింది. తర్వాత.. ఇక్కడి రైతుల కృషి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వచ్చిన మార్పు కారణంగా.. కూటమి సర్కారు ఏర్పడింది. ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ ద్వారా.. అమరావతిని మహా నగరంగాతీర్చిదిద్దేందుకు.. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. మరోసారి వైసీపీ అదికారంలోకి వస్తే.. మళ్లీ మూడు రాజధానుల పాట పాడుతుందన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిని ఎవరు వచ్చినా.. కదల్చకుండా చర్యలు చేపట్టారు.
దీనికి కేంద్రం సమ్మతించింది. ఇదేసమయంలో పార్లమెంటులో చట్టం చేయాలని నిర్ణయించింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు.. కేవలం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక్కటి ఆమోదిస్తే... దీనికి సంబంధించిన బిల్లు రూపొందించే ప్రక్రియ పూర్తికానుంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, హోం శాఖ, ఆర్థిక శాఖలు ఆమోదించాయి. కీలకమైన నీతి ఆయోగ్ కూడా అమరావతికి ఓకే చెప్పింది. గత రెండు మాసాల కిందట నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అమరావతిలో పర్యటించారు.
ఆయన సమూలంగా అన్ని అంశాలను పరిశీలించి ఓకే చేశారు. ఇక, ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు. దీంతో అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత ఏర్పడనుంది. ఫలితంగా ప్రభుత్వం ఏది ఏర్పడినా.. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండనుంది. అంతేకాదు.. ఏకైక రాజధానిగా కూడా ఇదేకొనసాగనుంది. దీనికి పెద్దగాసమయం లేదని.. కేంద్ర మంత్రి వర్గం కూడా అభిప్రాయపడుతోంది.