నాడు అలస్కా.. నేడు గ్రీన్ లాండ్.. కొనుగోళ్లు ఎలా జరుగుతాయంటే..!
వెనిజువెలా అధ్యక్షుడి అరెస్ట్ అనంతరం గ్రీన్ లాండ్ పై స్వరం పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.;
వెనిజువెలా అధ్యక్షుడి అరెస్ట్ అనంతరం గ్రీన్ లాండ్ పై స్వరం పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిన్న మొన్నటి వరకూ ఆరు నూరైనా నూరు ఆరైనా గ్రీన్ లాండ్, అమెరికా భూభాగం అంటూ మాట్లాడారు, మ్యాప్ లు పోస్ట్ చేశారు. కట్ చేస్తే.. దావోస్ లో కాస్త మెత్తబడినట్లు కనిపించారు. ఈ విషయంలో బల ప్రయోగాలు ఉండవని, బలవంతం చేయనంటూ మాట్లాడారు. ఈ సమయంలో మొన్న అలస్కా అయినా, నేడు గ్రీన్ లాండ్ అయినా.. ఈ కొనుగోళ్లు ఎలా జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.
అవును... అటు నాటోకు.. లేదా, ఇటు యూరప్ తో అమెరికా కూటమికి నష్టం వాటిల్లినప్పటికీ.. డెన్మార్క్ నుండి గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకోవాలనే తన కోరికను ట్రంప్ చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ అందమైన మంచు ముక్క తమకు కావాలని మారాం చేస్తున్నారు. దీనికి కారణం రష్యా, చైనాల నుంచి భద్రత సమస్య అని చెప్పినా... తమకూ గ్రీన్ లాండ్ కూ సంబంధం లేదని పుతిన్ చెప్పారు. అయితే.. ఈ కొనుగోలు ఎలా జరుగుతుందనేది మాత్రం వైట్ హౌస్ చెప్పడం లేదు.
వాస్తవానికి... 1867లో ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు $7.2 మిలియన్లకు అలాస్కాను రష్యన్ సామ్రాజ్యం నుంచి అమెరికా కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా అమెరికాకు దాదాపు 1.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూమి అదనంగా లభించింది. ఫలితంగా.. 1959లో ఆధునిక అలాస్కా రాష్ట్రం సృష్టించబడింది. అంతకుముందు.. 1803లో ఫ్రాన్స్ నుండి 2 మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూమిని అమెరికా 15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
థామస్ జెఫెర్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లూసియానాను స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో.. 1917లో కరేబియన్ లోని దీవుల సమూహమైన డానిష్ వెస్టిండీస్ ను అమెరికా కొనుగోలు చేసి.. వాటికి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అని పేరు పెట్టింది! ఇలా అవకాశం చిక్కినప్పుడో, మనసు పుట్టినప్పుడో అమెరికా ఇలా పలు భూభాగాలను కొనుగోలు చేస్తూనే ఉంది. అయితే.. గ్రీన్ లాండ్ తో అంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. రాజ్యాంగాన్ని, చరిత్ర ఉదాహరణలను పరిశీలిస్తే.. ట్రంప్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపాన్ని కొనుగోలు చేయడానికి డెన్మార్క్, గ్రీన్ లాండ్ లతో ఒక ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగం ప్రకారం.. ఒక ఒప్పందాన్ని ఆమోదించడానికి 67 మంది సెనేటర్లు అవసరం. అంటే.. ట్రంప్ రిపబ్లికన్లతో పాటు కొంతమంది డెమొక్రాట్లు దీనికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.. ట్రంప్ వారిని ఒప్పించాల్సి ఉంటుంది! అలాకానిపక్షంలో ఇది జరిగేపని కాదు!!
డెన్మార్క్, గ్రీన్ లాండ్ లతో ఉన్న ఒప్పందాల ప్రకారం.. గ్రీన్ లాండ్ లో తన సైనిక ఉనికిని భారీగా పెంచుకునే సామర్థ్యం అమెరికాకు ఉంది. కానీ, ట్రంప్ మాత్రం గ్రీన్ లాండ్ ను పూర్తిగా సొంతం చేసుకోవడానికి ఇష్టపడతానని చెబుతున్నారు. అయితే.. యూఎన్ చార్టర్ ప్రకారం అందుకు గ్రీన్ లాండ్ వాసుల అనుమతి అవసరం. ఒకవేళ అంతర్జాతీయ చట్టం తమకు వర్తించదని ట్రంప్ అనుకున్నా... రాజ్యాంగం ప్రకారం సెనేట్ ఆమోదం తప్పనిసరి!
వర్జిన్ దీవుల కొనుగోలు నేర్పుతున్న పాఠం!:
ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే... 1867 సమయంలో అప్పటి విదేశాంగ కార్యదర్శి విలియం సెవార్డ్ నేతృత్వంలోని అమెరికా, అంతర్యుద్ధం సమయంలో వర్జిన్ దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గ్రహించి, ఇష్టపూర్వకంగా ఉన్న డెన్మార్క్ నుండి $7.5 మిలియన్లకు వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో.. ఇరుపక్షాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, ఇది డెన్మార్క్ లో ఓటు ద్వారా ఆమోదించబడింది.
అయితే.. ఈ ఒప్పందాన్ని సెనేట్ ఆమోదించడంలో విఫలమైనందున 1867 అమ్మకం చివరికి జరగలేదు! ఆ సమయంలో అభిశంసనకు గురైన అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ కు విలియం హెన్రీ సెవార్డ్ మద్దతు ఇచ్చారు. దీంతో.. సెనేటర్లు అతనిపై కోపంగా ఉన్నారు. అనంతరం.. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చే వరకు ఈ దీవులను ఆక్రమించుకుంటామని బెదిరించిన అమెరికా.. $25 మిలియన్ల బంగారు నాణేలకు అమ్మకం జరిగేలా చేసింది.
అందుకు.. డానిష్ పార్లమెంట్, ఆ దేశ రాజు, ప్రజాభిప్రాయ సేకరణ ఆమోదించిన తర్వాత.. 1916 సెప్టెంబర్ లో సెనేట్ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. అయితే ఆ సమయంలో ద్వీపవాసుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని అంటారు. ఇక తాజా పరిస్థితికి వస్తే... గ్రీన్ లాండ్ ను కొనేందుకు డెన్మార్క్ లేదా గ్రీన్ లాండ్ ల ఇష్టపూర్వక సహకారం లేదు, యూఎస్ సెనేట్ కూడా అంగీకరించడం లేదు అని అంటున్నారు! వాట్ నెక్స్ట్ అనేది వేచి చూడాలి!