కేటీఆర్‌లో ఆ బాధ ఎక్కువైంది: దానం సెటైర్లు
అందుకే.. తమపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని దానం విమర్శించారు. తాజాగా స్పీకర్ ప్రసాద రావు.. అనర్హత పిటిషన్ల విషయంలో దానం, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు;
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఆ పార్టీ తరఫున 2023లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న ఖైరతాబాద్ నాయకుడు దానం నాగేందర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2023లో పార్టీ ఓడిపోయినందుకు కేటీఆర్ బాధపడలేదన్నారు. కానీ, 2018లో తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని మాత్రం కేటీఆర్ తెగ బాధపడ్డారని.. ఇప్పుడు ఆ బాధ మరింత పెరిగిందని విమర్శించారు.
అందుకే.. తమపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని దానం విమర్శించారు. తాజాగా స్పీకర్ ప్రసాద రావు.. అనర్హత పిటిషన్ల విషయంలో దానం, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన దానం.. తాను పార్టీ మారానని ఎవరికైనా చెప్పానా? అని ప్రశ్నించారు. తాను ఇప్ప టికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. ఆ పార్టీ సభ్యత్వమే కొనసాగుతోందన్నారు. అంతేకాదు.. పార్టీకార్యక్రమాల కు పిలిస్తే.. వెళ్తానని గతంలోనూ చెప్పానన్నారు.
కానీ, తనను ఏకార్యక్రమానికీ పిలవడం లేదని దానం వ్యాఖ్యానించారు. తాజాగా మంగళవారం బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం(బడ్జెట్ సమావేశాలకు ముందు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం) నిర్వహించారని.. కానీ, తనను మాత్రం పిలవలేదని అన్నారు. తప్పు ఎవరు చేశారో.. ఎవరిపై నెపం నెడుతున్నారనో తెలుస్తూనే ఉందన్నారు. తాను పార్టీ మారలేదన్నారు. స్పీకర్ ఇచ్చిన నిర్ణయం తనను సంతోషానికి గురి చేసిందన్నారు.
ఇది అప్రజాస్వామికం: కేటీఆర్..
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాదరావు తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామిక నిర్ణయమన్నారు. అంతేకాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎలా నీరు గార్చొచ్చో.. ఈ నిర్ణయాలు నిరూపిస్తున్నాయన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన వారు.. ఇలా ఏకపక్షంగా, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం దారుణమనివ్యాఖ్యానించారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో వారే సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు