జెన్ ఆల్ఫా...వైసీపీ మరో ఆకు ఎక్కువ మరి !
ఏమిటో ఇపుడు అంతా ఒక్కసారిగా యువత మీద పడ్డారు. అందులో పాత తరం యువత కంటే కొత్త తరం ముద్దు.
ఏమిటో ఇపుడు అంతా ఒక్కసారిగా యువత మీద పడ్డారు. అందులో పాత తరం యువత కంటే కొత్త తరం ముద్దు. యువత అంటే 35 ఏళ్ళ లోపు వారు. 1990 తర్వాత పుట్టిన వారు అంతా యూత్ కిందకే లెక్కలోకి వస్తారు. అయితే ఈ యూత్ నందు జెన్ జీ యూత్ మరింత గొప్ప అని దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ ఊగిపోతూంటే వైసీపీ మరో నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుంది. జెన్ ఆల్ఫా అంటోంది. వారిని పట్టుకుంటే చాలు పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియాను పూర్తిగా నమ్ముకోవాలని సూచిస్తున్నారు.
ఇంతకీ జెన్ ఆల్ఫా అంటే :
మరి జెన్ ఆల్ఫా అంటే ఎవరో ఏ కేటగిరీ కిందకు వస్తారో తెలుసా. 2010 నుండి 2024 మధ్య జన్మించిన వారిని జెనరేషన్ ఆల్ఫాగా చెబుతారు. ఈ తరం వారు అయితే సాంకేతికతతో పూర్తిగా పెరిగిన వారు అన్న మాట. తమ చుట్టూ టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఏఐతో కలసి పెరగడం అన్న మాట. వీరు పూర్తిగా సోషల్ మీడియా బేబీలుగా ఉంటారు. క్షణాలలో సమాచారం అందుకోవడం పంచుకోవడంలో వీరు దిట్టలు. అందుకే వీరిని పట్టుకోవాలని వైసీపీ కోరుతోంది.
వన్ మెన్ ఆర్మీగా :
వైసీపీ నిర్వహించిన సోషల్ మీడియా సమావెశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జెన్ జీ తో పాటు జెన్ ఆల్ఫాతో కలసి పనిచేయాలని సూచించారు. అంతే కాదు ప్రతి కార్యకర్త వన్ మెన్ ఆర్మీలా పనిచేయాలని ప్ దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా ఒక పవర్ ఫుల్ ఆయుధంగా ఆయన చెప్పారు. అయితే సోషల్ మీడియాలో అసభ్య పదజాలం మార్ఫింగ్ కంటెంట్‌కు తావివ్వకూడదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పి కొట్టాలని ఆయన కోరారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని ఆయన తమ పార్టీ సొషల్ మీడియా వింగ్ కి సూచించారు.
పార్టీ అండగా :
ఇక వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అక్రమంగా ఎవరి మీద అయినా కేసులు పెడితే మాత్రం తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎవరు కష్టపడతారో వారికే పదవులు అని అన్నారు. ప్రతీ కార్యకర్తకు గుర్తింపు వైసీపీలో వస్తుందని అన్నారు. భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు జరిగితే కచ్చితంగా వారికి కార్పొరేషన్ చైర్మన్లు దక్కుతాయని అలాగే ఎమ్మెల్సీల వంటి మంచి అవకాశాలను పార్టీ ఇస్తుందని చెప్పారు. ఇక సోషల్ మీడియా వింగ్ కి మరో ఆఫర్ ని కూడా ప్రకటించారు. ప్రతి నెలా మీ సోషల్ మీడియా ఖాతాల పనితీరు పరిశీలిస్తామని అందులో బాగా కంటెంట్ పెట్టిన వారిని నేరుగా అధినేత జగన్‌తో భేటీ అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ సోషల్ మీడియాతో పాటు జెన్ జీ జెన్ ఆల్ఫా మీద ఫోకస్ ఫుల్ గా పెట్టేసినట్లుగా ఉంది అని అంటున్నారు.