వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. 4 వారాల్లోనే తీర్పు!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.;

Update: 2026-03-11 11:57 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కేసు దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ స్పష్టం చేయడంతో విచారణ వేగవంతం చేయాలని దిగువ కోర్టుకు సూచించింది. నాలుగు వారాల్లో అన్ని పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వివేకా కేసులో దర్యాప్తును మధ్యలోనే నిలిపివేశారని, హత్యతో మరికొందరికి సంబంధం ఉందని వివేకా కుమార్తె వైఎస్ సునీత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు సూచన మేరకు నాంపల్లి సీబీఐ కోర్టు కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపినా కొత్తగా నిందితులుగా ఎవరినీ గుర్తించలేదని సుప్రీంకోర్టుకు నివేదించింది.

సీబీఐ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివేకా కేసులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీత వేసిన పిటిషన్లను పరిష్కరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ల రద్దు చేయాలన్న సునీత వినతిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అంతేకాకుండా తాము లేవనెత్తిన అభ్యంతరాలపై దర్యాప్తు జరపలేదని సునీత అభ్యంతరంపై ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ట్రయల్ కోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

కాగా, సీబీఐ నిర్ణయంతో ఈ విషయంలో వివేకా కుమార్తె సునీతకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. కేసులో ఇప్పటికే గుర్తించిన నిందితులతోపాటు మరికొందరికి సంబంధం ఉందని సునీత అనుమానిస్తున్నారు. తన అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో హత్య కేసు ట్రైల్ కూడా ఆలస్యమవుతోందని అంటున్నారు. దర్యాప్తు పూర్తయిందని, నిందితులు అందరినీ అరెస్టు చేశామని సీబీఐ చెబుతూ వస్తోంది. అదే సమయంలో సునీత అభ్యంతరాలను అనుమానాలను పరిష్కరించేందుకు ట్రయల్ కోర్టు సూచనల మేరకు నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డిని విచారించింది.

ఈ విచారణలో కొత్త విషయాలు ఏవీ వెలుగు చూడలేదని సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. దీంతో సునీత అనుమానాలు అపోహలుగానే మిగిలిపోయాయని అంటున్నారు. హత్యకు సంబంధించి ట్రయల్ కోర్టులో మూడో చార్జిషీటును కూడా సీబీఐ సమర్పించడంతో దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టు నిర్ణయిచిందని అంటున్నారు. ఇకపై ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని భావించడమే కాకుండా, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. వివేకా హత్య జరిగి ఇప్పటికే ఆరేళ్లు దాటిపోయింది. ఇప్పటికే నిందితుల అరెస్టు జరగడం, చార్జిషీటులు దాఖలు కావడంతో బెయిలు రద్దు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో నాలుగు వారాల గడువులోగా 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లను పరిష్కరించే పరిస్థితి కనిపిస్తుండటంతో త్వరలో వివేకా కేసుపై విచారణ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News