రాష్ట్రంలో ఆర్థిక విద్వంశం....ఆదాయం శూన్యం
ఏపీని అప్పుల కుప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.;
ఏపీని అప్పుల కుప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 20 నెలలలోనే బాబు చేసిన అప్పులు అక్షరాలా 3.80 లక్షల కోట్ల రూపాయలుగా జగన్ చెప్పారు. అయిదేళ్ళ వైసీపీ హయాంలో చేసిన అప్పులు మొత్తం 3.30 లక్షల కోట్లే అని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా బాబు వైసీపీ ప్రభుత్వాన్ని మించి పోయారని ఎద్దేవా చేశారు.
ఆదాయం తగ్గింది :
ఏపీలో గత ఇరవై నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది అని జగన్ చెప్పారు. అదే సమయంలో అప్పులు పెరిగాయని అన్నారు. ఈ విషయాలని కాగ్ రిపోర్టు చెప్పిందని అన్నారు. 2023-2024లో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లుగా ఉంటే ఆ ఏడాది రాబడులు రూ.1,70,767 కోట్లుగా ఉందని ఆయన చెప్పారు. అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906 కోట్లుగా ఉంటే రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే అని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లుగా ఉందని అన్నారు. బాబు ఏలుబడిలో రెవిన్యూ లోటు 56 శాతం పెరిగిందని గుర్తు చేశారు. అలాగే ద్రవ్య లోటు 30 శాతం పెరిగిందని అన్నారు.
కాగ్ రిపోర్టులో అలా ఉంటే :
ఇక ఏపీ చేసిన అప్పులు ఎవరికీ తెలియకుండా దాచేసే ప్రయత్నం బాబు చేస్తున్నారు అని అన్నారు కాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లుగా పేర్కొంటే అసెంబ్లీలో రూ.60,485.40 కోట్ల రూపాయలుగా కూటమి ప్రభుత్వం చెప్పింది అని ఆయన విమర్శించారు. ఆ విధంగా సుమారు 20వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉందని అన్నారు. ఏపీలో వనరులు అన్నీ దోచిపెడుతున్నారని ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని జగన్ ప్రశ్నించారు. మట్టిని,ఇసుక,భూములు,లిక్కర్ దేన్ని కూటమి నేతలు వదలడం లేదని ఆయన విమర్శించారు.
కోవిడ్ ఉన్నా కూడా :
తమ హయాంలో రెండేళ్ళ పాటు కోవిడ్ ఉన్నా కూడా ఆదాయాలు తగ్గినా హామీలు అన్నీ నెరవేర్చమని జగన్ చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. గడచిన రెండేళ్ళలో గజం జాగా కూడా ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని అన్నారు. వైసెపీ హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చి అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేశామని 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశామని జగన్ చెప్పారు. వైసీపీ హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మాత్రం 2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. పెన్షన్ల కోసం బడ్జెట్‌లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్‌లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే అన్నారు దీంతో భవిష్యత్‌లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందని చెప్పారు.
క్రెడిట్ చోరీ :
తాము చేసిన మంచి పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు అని విమర్శించారు. రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేసి పాస్ బుక్కులు ఇచ్చిన ఘనత తమదే అన్నారు ఇందుకోసం డ్రోన్లను వినియోగించామని అన్నారు. అలాగే పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఖర్చు చేశామని చెప్పారు. కానీ ప్రతీ మీటింగులో బాబు అది తానేదో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని జగన్ ఫైర్ అయ్యారు.