జగన్ పాదయాత్ర ఫలించేనా.. ఇటీవల అనుభవాలు ఇవే!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయనే ఒక ముగింపు ఇచ్చారు.;
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయనే ఒక ముగింపు ఇచ్చారు. తాను పాదయాత్ర చేస్తానని.. అయితే.. ఇప్పుడే కాదని..ఏడాదిన్నర తర్వాత ప్రారంభించి 2029 ఎన్నికల నాటి వరకు కొనసాగిస్తానని చెప్పారు. అయితే.. జగన్‌కు పాదయాత్ర కొత్తకాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఏడాదిన్నర ఆయన పాదయాత్ర చేశారు. అంటే.. ఒక దఫా ప్రజల మధ్యకు పాదయాత్ర రూపంలో వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు . అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి కేవలం అధికారం కోసమే అన్నట్టుగా ఆయన యాత్ర చేపడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, నాయకులు తమకు ఉన్న అన్ని కోణాల్లోనూ ప్రజల మధ్యకు వెళ్లడం తప్పుకాదు. అయితే.. ఇలా వెళ్లిన వారు ఇటీవల కాలంలో సక్సెస్ అవుతున్నారా? అంటే.. ప్రశ్నలే మిగులుతున్నాయి. జగన్ పాదయాత్ర చేసింది.. 2019కి ముందు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేసింది.. 2024కు ముందు. ఈ ఇద్దరూ సక్సెస్ అయ్యారు. కానీ, ఆ తర్వాత.. అంటే.. 2024 నుంచి దేశంలో పాదయాత్రలు చేసిన వారు.. సక్సెస్ అయిన దాఖలా అయితే కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసినా ఏమేరకు సక్సెస్ అవుతారు? అనేది ప్రశ్న.
రాహుల్ గాంధీ: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన కొన్ని రాష్ట్రాలు మినహా.. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కానీ.. ఈ యాత్ర ఫలించలేదు. పైగా.. ఆయన పాదయాత్ర చేసిన రాష్ట్రాల్లో కూడా పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ ఈ యాత్ర ఏమాత్రం ఫలితం చూపించలేక పోయింది. దీంతో రాహుల్ చేసిన పాదయాత్ర కేవలం ఫొటోలు, ప్రచారానికి మాత్రమే పరిమితం అయిందనే వాదన ఉంది.
ప్రశాంత్ కిషోర్: రాజకీయ వ్యూహకర్తగా 2019లో జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన ప్రశాంత్ కిషోర్ స్వయంగా సొంత పార్టీ జన్ సురాజ్ పెట్టుకున్నారు. ఇదే పేరుతో ఆయన బీహార్‌లో ఆయన పాదయాత్ర కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పీకే చేసిన ఈ యాత్ర ఒకరకంగా మేలిమలుపు అవుతుందని అందరూ భావించారు. కానీ, తీరా చూస్తే.. ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. సో.. ఇవన్నీ 2024 తర్వాత జరిగిన పాదయాత్రలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో జగన్ పాదయాత్రను ప్రజలు ఏమేరకు స్వాగతిస్తారన్నది ప్రశ్న. పైగా ఐదేళ్ల పాలనతో ప్రజలకు చేరువ కాలేక పోయిన.. జగన్ ఇప్పుడు మరోసారి పాదయాత్రను ఎంచుకోవడం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.