టార్గెట్ లోకేశ్.. వైసీపీ గురి మారుతోందా?

ఏపీలో విపక్షం వైసీపీ రాజకీయ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా మంత్రి లోకేశ్ టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతుండటం చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-22 19:30 GMT

ఏపీలో విపక్షం వైసీపీ రాజకీయ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా మంత్రి లోకేశ్ టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కంటే ఎక్కువగా వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా లోకేష్ చూపిస్తున్న వేగం, తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. లోకేష్‌ను రాజకీయంగా దెబ్బతీయడం ద్వారానే తమకు భవిష్యత్తు ఉంటుందని, టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టవచ్చనే వ్యూహంతో వైసీపీ హైకమాండ్ కదులుతోందని అంటున్నారు.

ఇటీవల కాలంలో మంత్రి లోకేశ్ పనితీరు, ఆయన పరిధిలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో లోపాలపై వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీ సోషల్ మీడియా సైతం లోకేశ్ పనితీరును డేగ కళ్లతో పరిశీలిస్తోందని అంటున్నారు. దీంతో మంత్రి లోకేశ్ సైతం విపక్షానికి రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నట్లే నడుచుకుంటున్నారని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం మైలవరం మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ ఓ వీడియో వైరల్ అవడం, మంత్రి లోకేశ్ ఆ వెంటనే ఆ పాఠశాలకు వెళ్లి తనఖీ చేయడం చూస్తే రెండు పార్టీల వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని అంటున్నారు.

మంత్రిగా లోకేష్‌ ప్రస్తుతం చాలా దూకుడుగా పనిచేస్తున్నారు. 2019కి ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ అప్పట్లో లోకేశ్ కు లేని క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఈ టర్మ్ తర్వాత టీడీపీ పగ్గాలు లోకేశ్ చేతికి రావడం ఖాయమనే అంచనాతో వైసీపీ వ్యూహం మార్చిందని అంటున్నారు. చంద్రబాబుతో రాజకీయ యుద్ధం చేయడం కన్నా, లోకేశ్ ను ఎంచుకోవడం ద్వారా ప్రజల్లో ఆయన పరపతి పెరగకుండా చూడాలని వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అందుకే గతంలో లోకేశ్ పనితీరును హేళన చేసిన వైసీపీ ఇప్పుడు లోకేశ్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుపుతున్నారంటూ దుమ్మెత్తిపోస్తోందని అంటున్నారు.

'యువగళం' పాదయాత్ర ద్వారా లోకేష్‌ ఒక పరిణతి చెందిన నాయకుడిగా మారడంతోపాటు టీడీపీపై పట్టు సాధించారని వైసీపీ గుర్తించిందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఐటీ, విద్యా శాఖలను నిర్వహిస్తూ లోకేశ్ దూకుడు చూపుతున్నారు. ఒకవైపు పెట్టుబడుల సాధనలో బిజీగా ఉంటూనే మానవవనరుల శాఖలో అనేక సంస్కరణలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో లోకేష్ గ్రాఫ్ పెరిగితే అది భవిష్యత్తులో టీడీపీని మరింత బలోపేతం చేస్తుందని జగన్ టీమ్ భావిస్తోందని అంటున్నారు. దీంతో లోకేష్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడంపైనే వైసీపీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు తర్వాత అంతా తానే అన్నస్థాయిలో నడిపిస్తున్న లోకేష్‌ను టార్గెట్ చేయడం ద్వారా, టీడీపీ సీనియర్ నేతల్లో అసహనం తట్టిలేపేలా వైసీపీ 'సైకలాజికల్ గేమ్' ఆడుతోందని అంటున్నారు. లోకేశ్ కూడా తరచూ సీనియర్లు పదవులు వీడాలని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చెప్పడాన్ని వైసీపీ వ్యూహాత్మకంగా ప్రచారం కల్పిస్తోందని అంటున్నారు. దీనిద్వారా పార్టీలో లోకేశ్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే గొంతులు పెరిగేలా ఎత్తుగడ వేస్తోందని అంటున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ఆశిస్తున్న వాతావరణం టీడీపీలో కనిపించడం లేదు. పార్టీలో ఎవరూ లోకేశ్ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోందని, రానున్నరోజుల్లో లోకేశ్ టార్గెట్ గా మరింత వాడివేడి రాజకీయం ఉండబోతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News