జగన్ మావిగన్ ప్రతిపాదన... వైసీపీ కీలక నిర్ణయం.. ఇక ముందుకే!
రాజకీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’పై ముందుకే వెళ్లాలని విపక్ష వైసీపీ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.;
రాజకీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’పై ముందుకే వెళ్లాలని విపక్ష వైసీపీ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. రెండు రోజుల మేధోమథనం అనంతరం జగన్ ప్రతిపాదిత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని కారిడార్ ఏర్పాటు చేయాలన్న వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. ఇదే విషయమై పార్టీ సీనియర్లకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారని అంటున్నారు.
రాజధానిగా అమరావతి అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతూ, అమరావతికి ఆ స్థాయిలో ఖర్చు చేయడాన్ని నిరసిస్తున్నట్లు వైసీపీ చెబుతోంది. పార్లమెంటులో దేశంలో ఉన్న అన్నిపార్టీలు మద్దతు తెలిపినా, వైసీపీ మాత్రం అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ సీఎం జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ మూడు ప్రాంతాలను కలిపి రాజధాని రీజియన్ గా అభివృద్ధి చేస్తే రాష్ట్రాభివృద్ధిగా గ్రోత్ ఇంజిన్ లా పనికొస్తుందని వ్యాఖ్యానించారు.
మీడియా సమావేశంలో జగన్ యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆ తర్వాత మావిగన్ పై వచ్చిన విమర్శలు, ఇతర అంశాలను బేరీజు వేసుకుని పార్టీ స్టాండ్ గా మావిగన్ కే కట్టుబడాలని వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు. వైసీపీ అనుకూల మీడియా సాక్షిలో సైతం ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారని, గంటల కొద్ది టీవీ డిబేట్లు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అనంతరం సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు మావిగన్ తెలివైన ఆలోచన అంటూ కొనియాడటం వైసీపీ వ్యూహాంలో భాగమే అంటున్నారు.
జగన్ మావిగన్ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అయితే దీనిని ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా విభాగం చేస్తున్న ప్రచారంగానే వైసీపీ చూస్తోంది. ప్రజలు మాత్రం జగన్ ప్రతిపాదించిన మావిగన్ కోసం చర్చించుకుంటున్నారని సాక్షి పత్రిక రాసుకొస్తుంది. మరోవైపు జగన్ మావిగన్ పై వైసీపీలోనే భిన్నమైన చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇన్నాళ్లు మూడు రాజధానులు పార్టీ విధానంగా చెప్పామని, ఇప్పుడు మావిగన్ అంటూ ఎలా మాట్లాడగలమని కొందరు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో విశాఖ పరిపాలన రాజధాని అన్న నినాదాన్ని ఇక వదిలేసినట్లేనా? అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగన్ మావిగన్ విషయంలో వైసీపీ ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.