లిస్టు రెడీ.. ఆ ఎమ్మెల్యేలు సర్దుకోవాల్సిందే.. డిసైడ్ అయిన చంద్రబాబు
కట్టుతప్పిన ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
కట్టుతప్పిన ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రెండేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరుపై దిశానిర్దేశం చేస్తున్నా కొందరు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకపై అటువంటి వారిని ఎంత మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఈ విషయమై తన అంతరంగాన్ని సీఎం బయటపెట్టడంతో టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోవడం లేదని, దాంతో వారిని వదిలించుకోవడమే మేలు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని సీనియర్లు చెబుతున్నారు.
కొత్తగా ఎన్నికైన వారితోపాటు కొందరు సీనియర్ల పనితీరు నిరాశజనకంగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయా ఎమ్మెల్యేలకు చెప్పినా వారు మారడం లేదన్నట్లు అధినేత భావిస్తున్నారు. వాళ్లతో పాటే అందరినీ ముంచేస్తారని ఆందోళన చెందుతున్న చంద్రబాబు 2029 ఎన్నికలకు 1999 ఫార్ములా తీసుకువస్తానని తాజాగా జరిగిన ఎంపీల సమావేశంలో స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై చర్చ జరిగిందని, కొందరు ఎమ్మెల్యేలు తమ మాట వినడం లేదని సీనియర్ ఎంపీలు చెప్పగా సీఎం ఘాటుగా స్పందించినట్లు చెబుతున్నారు.
పార్టీకి మంచి జరిగేలా అందరూ నడుచుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి మొహమాటలకు తావు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. పార్టీకి నష్టం చేస్తున్న వారికి ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, ఇకపై అటువంటి మాటలు ఉండవని సీఎం తేల్చిచెప్పారని అంటున్నారు. దీంతో పార్టీలో వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ మొదలైనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై వారికి ఎటువంటి అవకాశం ఇవ్వమని చెప్పడం ద్వారా పార్టీలో ప్రభుత్వంలో ఆయా ఎమ్మెల్యేల ప్రాధాన్యం తగ్గించడమే కాకుండా వారిస్థానంలో ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
సీఎం స్పష్టమైన హెచ్చరికలతో ఈ అసెంబ్లీతో మాజీ అయ్యే ఎమ్మెల్యేలు ఎవరెవరు అంటూ అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సుమారు 50 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తిగా లేరని అంటున్నారు. అయితే వీరిలో సగం మంది పనితీరు మెరుగుపరుచుకునే క్రమంలో కాస్త పురోగతి సాధిస్తున్నారని, అధిష్టానం ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కానీ దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం తామే హైకమాండ్ అన్నట్లు నడుచుకుంటూ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం వద్ద సమాచారం ఉందని చెబుతున్నారు. వీరిని మార్చకుంటే వచ్చే ఎన్నికల్లో తమ పుట్టి మునిగిపోతుందని సీఎం స్వయంగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అంటున్నారు. దీంతో టీడీపీలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తట్టబుట్టా సర్దుకోవాల్సిందేనని టాక్ వినిపిస్తోంది.