కేంద్రంతో కలిసి నడుద్దాం...!? డీఎంకే సంచలన నిర్ణయం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా కాంగ్రెస్ తో తీవ్రంగా విభేదిస్తున్న డీఎంకే పార్టీ కేంద్రంలో అధికార బీజేపీకి స్నేహహస్తం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిన కాంగ్రెస్ తమను ఒంటరిని చేసిందని డీఎంకే భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ విధానాలతో సంబంధం లేకుండా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంశాల వారీగా అధికారపార్టీకి సహకరించాలని డీఎంకే అధినేత స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో డీఎంకే వైఖరిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న అధికార ఎన్డీఏ కూటమి విపక్షంలోని పలు పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా 22 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే మద్దతు కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. గత సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో చెలిమి కారణంగా అధికార బీజేపీ వ్యతిరేక విధానం తీసుకున్న డీఎంకే పార్టీ కేంద్రం ప్రతిపాదించిన రెండు బిల్లులను తిరస్కరించింది. దీంతో 2/3 వంతు మెజార్టీ సాధించలేక కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు నియోజవర్గాల పునర్విభజన బిల్లులు వీగిపోయాయి.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ రెండు బిల్లులు అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. మహిళా రిజర్వేషన్ అమలుపై అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాత్రం భిన్నాభిప్రాయలు నెలకొన్నాయి. జనాభా ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంచుతామని గతంలో ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతిపాదించడంతో విపక్షం విభేదించింది. అప్పట్లో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడం, కాంగ్రెస్ తో విభేదాలు రావడంతో డీఎంకే ఆలోచన ప్రస్తుతం మారిందని అంటున్నారు. ఇదే సమయంలో కేంద్రం కూడా పునర్విభజన బిల్లులో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధం అవడంతో డీఎంకే వ్యూహాత్మకంగా తన నిర్ణయం మార్చుకునేందుకు తగిన వాతావరణం ఏర్పడిందని అంటున్నారు.
జనాభాతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా 50 శాతం సీట్లు పెంచేలా మార్పు చేసి పునర్విభజన బిల్లు తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. దీంతో తమిళనాడులో ప్రస్తుతం ఉన్న స్థానాలు 39 నుంచి 60కి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనివల్ల తమిళనాడు ప్రాంతీయ అస్థిత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదని, రాష్ట్ర గళం గట్టిగా వినిపించే అవకాశం కూడా ఉంటుందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారం కోసం తమను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ వైఖరి కారణంగా గతంలో బీజేపీని వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు అదే విధమైన ఆలోచనతో ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో స్నేహం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో లేనిలోటు తీర్చుకోవడమే కాకుండా, పార్టీ బలోపేతానికి కూడా కేంద్రం సహాయ సహకారాలు తీసుకోవచ్చునని డీఎంకే భావిస్తోందని అంటున్నారు. దీంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలనే అంశమై డీఎంకేలో ఏకాభిప్రాయం వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 2/3 వంతు మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి భారీ ఉపశమనం దక్కినట్లే అంటున్నారు. డీఎంకే భరోసాతో కేంద్రానికి ఇంకా నలుగురు సభ్యుల మద్దతు మాత్రమే అవసరం అవుతుందని చెబుతున్నారు. ఈ సంఖ్యను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.