టీడీపీ నేత దారుణం.. బాబు సీరియ‌స్‌.. ఏం జ‌రిగింది?

దీంతో వెంట‌నే స్పందించిన సీఎం చంద్ర‌బాబు స‌ద‌రు నేత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో పాటు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు.

Update: 2026-07-18 11:16 GMT

మ‌హిళ‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వారి గౌర‌వానికి ఎలాంటి భంగం క‌ల‌గ‌కుండా చూస్తున్నామ‌ని చెబుతున్న కూట‌మి ప్ర‌భుత్వంలో అధికార పార్టీ టీడీపీకి చెందిన ఓ కార్య‌క‌ర్త దారి త‌ప్పారు. మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి న‌డిరోడ్డుపై చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో వెంట‌నే స్పందించిన సీఎం చంద్ర‌బాబు స‌ద‌రు నేత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో పాటు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఆ వెంట‌నే పోలీసులు స‌ద‌రు నేత‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏం జ‌రిగింది?

గుంటూరు జిల్లాలో రాజ‌ధానికి ఆనుకుని ఉన్న ఓ ప్రాంతంలో మంచినీరు ప‌ట్టుకునే విష‌యంపై స్థానికంగా ఓ మ‌హిళ‌కు, ఇదే కాల‌నీకి చెందిన టీడీపీ నేత‌, డివిజ‌న్ కార్య‌ద‌ర్శి మ‌ల్లెల వెంక‌ట‌ర‌మ‌ణ‌మూర్తికి మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. త‌న ఇంటి ముందున్న కుళాయికి మోటారు బిగించి నీరు ప‌ట్టుకోవడాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన మూర్తి స‌ద‌రు మ‌హిళ‌పై దుర్భాష‌లాడారు. వెంట‌నే మోటారును తీసేయాల‌ని ఆదేశించారు. దీంతో మ‌హిళ‌కు-ఆయ‌న‌కు మ‌ధ్య మాట‌ల దాడి చోటుచేసుకుంది.

అనంత‌రం.. ఆమె త‌న మోటారు ప‌ట్టుకుని వెళ్లిపోతుండ‌గా.. మూర్తి కుటుంబ స‌భ్యులు, ముఖ్యంగా ఆయ‌న సోద‌రి, ట్రాన్స్ జెండ‌ర్ రంగంలోకి దిగి బాధిత మ‌హిళ‌పై దాడి చేసి దుస్తులు చించేసింది. పూర్తిగా వివ‌స్త్ర‌గా మారిన మ‌హిళ‌ల‌ను న‌డిరోడ్డుపైకి లాగి.. మూర్తిస‌హా.. ఆయ‌న బంధువులు పిడిగుద్దులు గుద్దారు. దీంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చి.. మ‌హిళ‌ను రక్షించి.. ఆమెకు దుస్తులు అందించి ఇంట్లోకి పంపారు. ఈ ఘ‌ట‌న ఈ నెల 15న జ‌ర‌గ్గా బాధితురాలు మరుస‌టి రోజు చుట్టుప‌క్క‌ల వారి సాయంతో పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే.. నిందితుడు టీడీపీ నేత కావ‌డంతో ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాక‌రించార‌ని బాధితురాలు తెలిపారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యాన్ని విప‌క్ష వైసీపీ వెలుగులోకి తీసుకువ‌చ్చింది. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెనుక‌ల‌క‌లం సృష్టించింది. వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. మూర్తిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో పాటు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. మరోవైపు.. కేసు పెట్టేందుకు నిరాక‌రించిన పోలీసుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సైతం ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Tags:    

Similar News