మారుతున్న గుడివాడ సీన్.. రీజ‌న్ ఇదే.. !

కానీ, ఈ త‌ర‌హా విధానాల‌కు భిన్నంగా.. గుడివాడ‌లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇత‌ర మార్గాల్లో నిధులు సేక‌రిస్తున్నారు.

Update: 2026-07-18 09:30 GMT

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. అప్ప‌టి వ‌రకు ఉన్న కొడాలి నానీ హ‌వాకు బ్రేకులు వేసి.. వెనిగండ్ల రాము దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌కవ‌ర్గాల్లో ప్ర‌భుత్వం సొమ్ములు ఇస్తే త‌ప్ప‌.. ప‌నులు ముందుకు సాగ‌ని ప‌రిస్థితి ఉంది. దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కానీ, ఈ త‌ర‌హా విధానాల‌కు భిన్నంగా.. గుడివాడ‌లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇత‌ర మార్గాల్లో నిధులు సేక‌రిస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ‌లో చ‌దువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి పొందిన వారిని సంప్ర‌దించి.. వారి నుంచి స్వ‌గ్రామాలకు నిధులు సేక‌రిస్తున్నారు. అలాగే.. పారిశ్రామిక వేత్త‌ల‌ నుంచి కూడా నిధులు స‌మీక‌రిస్తున్నారు వీటితో సుదీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ల‌ను , ప్రాజెక్టుల‌ను కూడా పూర్తి చేసేందుకు రాము ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గుడివాడ ముఖ చిత్రం సంపూర్ణంగా మారుతోంది.

నిజానికి గుడివాడ అంటే.. ఒక‌ప్పుడు అభివృద్ధి ఎలా ఉన్నా.. పేకాట క్ల‌బ్బులు, కేసినో, జూదాలు, కోడి పందేల‌కు కేరాఫ్‌గా ఉండేద‌నే టాక్ ఉంది. అంతేకాదు.. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అంటేనే.. అమ్మో! అనే మాట కూడా వినిపించేది. కానీ, ఈ త‌ర‌హా ప‌రిస్థితిని మార్చేందుకు గ‌త రెండేళ్లుగా రాము చేసిన కృషి ఫ‌లిస్తోంది. ఫ‌లితంగా నియోజ‌క వ‌ర్గంలో మార్కెట్ నుంచి ప్ర‌ధాన కూడ‌లి వ‌ర‌కు అద్భుత‌మైన ర‌హ‌దారులు ఏర్ప‌డ్డాయి. అలాగేస్థానికంగా కీల‌క‌మైన క‌ల్వ‌ర్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేశారు.

చంద్ర‌బాబు రాక‌

గుడివాడలో గ‌త రెండేళ్లుగా సాగిన అనేక అభివృద్ధి ప‌నులు పూర్తి ద‌శ‌లు చేరుకున్నాయి. వీటిని ప్రారంభించేందుకు సీఎం చంద్ర‌బాబు శ‌నివారం(జూలై 18) నియోజ‌క‌వ‌ర్గానికి రానున్నారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు తొలిసారి గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెడుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్ర‌బాబు రాక‌కోసం ల‌క్ష మంది అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించేందుకు పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. ఒక‌వైపు అభివృద్ధి, మ‌రో వైపు శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రంగా కూడా గుడివాడ రికార్డు సృష్టించ‌డం.. చంద్ర‌బాబు వ‌స్తుండ‌డం వంటివి గుడివాడ‌లో మార్పు దిశ‌గా వేస్తున్న అడుగుల‌కు కీల‌క‌మ‌ని ఎమ్మెల్యే చెబుతున్నారు.

Tags:    

Similar News