బీఆర్ఎస్‌కు మ‌రో షాక్‌: 'ధ‌ర‌ణి'పై ఫోరెన్సిక్ ఆడిట్‌

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రోసారి స‌ల‌స‌ల‌మ‌న‌నున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో చేప‌ట్టిన‌ కాళేశ్వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టులు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ వంటి వాటిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

Update: 2026-07-18 11:16 GMT

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రోసారి స‌ల‌స‌ల‌మ‌న‌నున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో చేప‌ట్టిన‌ కాళేశ్వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టులు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ వంటి వాటిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా కేసుల‌ను త‌వ్వి తీస్తోంది. ఇప్పుడు తాజాగా `ధ‌ర‌ణి` పోర్ట‌ల్ వంతు వ‌చ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో దీనిపై కీల‌కంగా చ‌ర్చించారు. సుమారు గంట‌న్న‌ర‌కు పైగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై చ‌ర్చించిన మంత్రివ‌ర్గం.. దీనిలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని నిర్ణ‌యించింది.

అయితే.. విచార‌ణ‌కు వెళ్లే ముందు.. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. అప్పుడు ప‌క్కా ఆధారాల‌తో విచార‌ణ‌కు ఆదేశించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, రాజ‌కీయంగా ఎలాంటి విమ‌ర్శ‌లు ఉండ‌వ‌ని కూడా ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా ధ‌ర‌ణిపై ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాల‌ను వెలికి తీయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా కేంద్రం ప్ర‌క‌టించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టు విష‌యంపైనా సుదీర్ఘంగా చ‌ర్చించారు. భూసేక‌ర‌ణ‌పై వ‌స్తున్న వివాదాల‌ను సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను మంత్రులు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.

బుల్లెట్ రైలు రాక‌తో రాష్ట్ర ముఖ చిత్రం మారుతుంద‌ని.. అయితే, దీనిని అడ్డుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించి భూ సేక‌ర‌ణ‌కు అనుకూలంగా మార్చాల‌ని ఆయ‌న మంత్రుల‌కు సూచించారు. బుల్లెట్ రైలు రాక‌తో రాష్ట్రంలో ఆర్థిక కార్య‌క‌లాపాలు పెర‌గ‌డంతో పాటు, పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అలాగే ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. ఈ ప్రాజెక్టును సాధ్య‌మైనంత వేగంగా ప‌ట్టాలెక్కించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. అయితే.. భూముల ధ‌ర‌లు మ‌రీ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టు అలైన్‌మెంటును మార్పు చేసేందుకు వెనుకాడ‌వ‌ద్ద‌ని కూడా సీఎం సూచించారు.

మ‌రిన్ని నిర్ణ‌యాలు ఇవీ..

+ పటాన్‌చెరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయనున్నారు.

+ జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పలు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు.

+ పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018కు సవరణలను ఆమోదించారు.

+ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఈ స‌వ‌ర‌ణ‌ల‌ను ఆమోదించ‌నున్నారు.

ఏంటీ ధ‌ర‌ణి..?

తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ధరణి పోర్ట‌ల్‌ను తీసుకువ‌చ్చారు. ఇది భూ రికార్డులను పారదర్శకంగా ఉంచడానికి ప్ర‌తిపాదించిన కీల‌క ప్రాజెక్టు. అయితే, సాంకేతిక లోపాలు, అవకతవకల ఆరోపణలతో తీవ్ర వివాదాస్పదమైంది. ధరణి పోర్టల్ ద్వారా భూముల కొనుగోలు, అమ్మకం, వారసత్వ బదిలీలు, ఇతర వ్యవహారాలు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే ఒకే చోట జరుగుతాయి. దీనిలో తహసీల్దారుకు సంయుక్త సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించి నేరుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేలా డిజైన్ చేశారు.

వివాదం ఎందుకు?

పోర్ట‌ల్‌లో ఓటీపీ, వేలిముద్రలు లాంటి ప్రాథమిక ధ్రువీకరణలు లేకుండానే.. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, సైబర్ నేరగాళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వాడి భూములను ఇతరుల పేర్లకు మార్చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ధరణిలో జరిగిన భారీ అక్రమాలు, భూ రికార్డుల ట్యాంపరింగ్‌పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ రూపకల్పన, నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటంతో రైతుల భూ సమాచారం గోప్యతకు భంగం వాటిల్లుతుందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆడిట్‌కు ఆదేశించాల‌ని నిర్ణ‌యించింది.

Tags:    

Similar News