అన్నా.. దయచేసి విశ్రాంతి తీసుకో..! - పవన్ ఆరోగ్యంపై అభిమానుల ఆవేదన
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం అభిమానుల తాకిడితో కిటకిటలాడుతోంది. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం అభిమానుల తాకిడితో కిటకిటలాడుతోంది. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం కోలుకునేందుకు పవన్ కనీసం నాలుగు రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. సీఎం చంద్రబాబు సైతం పవన్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాతే పాలన విధుల్లో చేరాలని కోరారు. కానీ, పవన్ ఇంటి వద్ద పరిస్థితి చూస్తే ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి ఆయనను కలిసేందుకు వస్తున్న నేతల తాకిడితో పవన్ మరింత అలసటకు గురి అవుతున్నారనే ఆవేదన వ్యక్తం అవుతోంది.
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడానికి వస్తున్న నేతల క్యూ చూస్తుంటే, ఇది కేవలం మర్యాదపూర్వకమైన పరామర్శలా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతోపాటు ఇతర రాజకీయ పక్షాలకు చెందిన కీలక నేతలు కూడా ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే పవన్ సుమారు ఆరు గంటల పాటు నేతలతో సమావేశమై, వారితో మాట్లాడటంలోనే సమయాన్ని గడపాల్సి వచ్చిందని చెబుతున్నారు. అతి మర్యాదస్తుడైన పవన్, వచ్చే వారిని కాదనలేక ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
వైద్యుల సూచనకు విరుద్ధం
భుజం సర్జరీ అయిన తర్వాత కుడి చేతికి పూర్తి విశ్రాంతి అవసరం. అయితే, పరామర్శకు వచ్చే వారికి స్వాగతం పలకడం, షేక్ హ్యాండ్లు ఇవ్వడం, బొకేలు అందుకోవడం వంటి పనులతో ఆయన కుడి భుజంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని అంటున్నారు. ఇలాగే కొనసాగితే గాయం మానడానికి ఆలస్యమవడమే కాకుండా, భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పవన్‌కు రాజకీయ సమావేశాలు, పరామర్శల కంటే ఆరోగ్యం ముఖ్యం" అంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కు విశ్రాంతి ఇవ్వండి అని కోరుతూ పోస్టులు చేస్తున్నారు.