గంటూరు ఉదంతంలో టీడీపీ నేతపై వేటు.. చంద్రబాబు, లోకేశ్ సీరియస్

గుంటూరులో చోటుచేసుకున్న అమానుష ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి. చట్టం అందరికే సమానమని స్పష్టం చేసింది.

Update: 2026-07-18 07:38 GMT

గుంటూరులో చోటుచేసుకున్న అమానుష ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి. చట్టం అందరికే సమానమని స్పష్టం చేసింది. మహిళపై కర్కశంగా వ్యవహరించిన సొంత పార్టీ నేత అరెస్టుకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఆ నాయకుడికి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళల భద్రత విషయంలో రాజీపడమని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. గుంటూరు ఘటన వెలుగుచూసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన వారికి పార్టీ నుంచి ఎటువంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో హెచ్చరించారు.

గుంటూరు నగరంలో కొళాయి నీటి కోసం గొడవలో మహిళలను వివస్త్రను చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు స్థానిక టీడీపీ నాయకుడికి ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నెల 15న రాత్రి గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ తన ఇంటి ముందు ఉన్న కొళాయి నీరు పట్టుకున్నారు. అయితే కొళాయికి మోటార్ తగిలించడంతో పక్కనున్న వారికి నీరు సరిగా రావడం లేదని వివాదం రేగింది. మహిళా ఇంటి కొళాయికి ఉన్న మోటారు తొలగించాలని 21వ వార్డు డివిజన్ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు సదరు మహిళతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో టీడీపీ నేత సోదరి, ట్రాన్స్ జెండర్ మాధవి మహిళపై దాడి చేసి గాయపరిచింది. అంతేకాకుండా మహిళ వంటిపై వస్త్రాలను చించేసిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా, టీడీపీ నేత మూర్తితోపాటు అతని సోదరితో కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సర్కిల్ ఇన్సస్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే టీడీపీ నేత మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం రాత్రే ప్రకటించారు. ఇక ఈ విషయం తీవ్ర వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు లోకేశ్, అనిత తీవ్రంగా స్పందించారు.

సీఎం ఆగ్రహం

మహిళపై దాడి ఘటనలో టీడీపీ నేత పాత్ర ఉందంటూ జరిగిన ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఘటన పూర్తి వివారాలు తెలుసుకుని ముందుగా నిందితుడిని పార్టీ నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తేల్చిచెప్పారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలను ఏమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన నొక్కి చెప్పారు.

మంత్రి నారా లోకేశ్ హెచ్చరిక

ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ పేరు చెప్పి ఎవరైనా దాడులకు పాల్పడితే, వారిని తాము ఎంతమాత్రం సమర్థించబోమని ఆయన స్పష్టం చేశారు. "రాజకీయ అండ ఉందనే అపోహలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన పరిణామాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో మహిళలకు అపవిత్రం కలిగించేలా ప్రవర్తించే వారిని పార్టీలో ఉండే అర్హత లేదు. నిందితులపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కాగా, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ విషయంలో పోలీసులు అత్యంత వేగంగా స్పందించారని ఆమె వెల్లడించారు. "బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్లను, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోందని ఆమె భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News