ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు

ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Update: 2026-07-18 04:38 GMT

క్రికెట్ సామ్రాజ్యంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా కీర్తింపబడిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) ఇకలేరు. తన 90వ పుట్టినరోజుకు కేవలం రెండు వారాల ముందు ఆయన తుదిశ్వాస విడిచారు. బార్బడోస్‌లోని తన స్వగృహంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోబర్స్ మరణం క్రికెట్ జగత్తుకు ఎప్పటికీ పూడ్చలేని లోటు.

బహుముఖ ప్రజ్ఞాశాలి.. అసాధారణ రికార్డులు

1954లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన గార్ఫీల్డ్ సోబర్స్ 1974 వరకు సుదీర్ఘ కాలం పాటు వెస్టిండీస్ జట్టుకు వెన్నెముకగా నిలిచారు. తన రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పటికీ అద్భుతాలే. 93 టెస్ట్ మ్యాచ్‌ల్లో 8,032 పరుగులు చేశాడు. ఆయన బ్యాటింగ్ సగటు 57.78. 26 సెంచరీలు.. 235 వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే తేడా లేకుండా మూడు విభాగాల్లోనూ అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి, క్రికెట్ చరిత్రలోనే "అత్యంత సంపూర్ణ ఆల్‌రౌండర్"గా ఆయన గుర్తింపు పొందారు.

ఆనాటి చారిత్రాత్మక రికార్డు

పాకిస్తాన్‌పై సోబర్స్ చేసిన 365 నాటౌట్ ఇన్నింగ్స్ ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ రికార్డు చెక్కుచెదరకుండా నిలిచింది.

మైదానంలోనే కాదు.. మనసులోనూ 'సర్'

క్రికెట్‌లో సాధించిన విజయాలకే కాకుండా మైదానంలో ఆయన ప్రదర్శించే క్రీడాస్ఫూర్తి, వినయం, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు సోబర్స్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా మార్చాయి. క్రీడా రంగానికి ఆయన చేసిన అనన్యసామాన్యమైన సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన "సర్" బిరుదును ఇచ్చి గౌరవించింది.

ప్రస్తుతం సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు కుమారులు డానియెల్, మాథ్యూ, దత్తపుత్రిక జెనీవివ్ ఉన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన రికార్డులు, నెలకొల్పిన ప్రమాణాలు, ఆటపై ఆయన చూపిన ప్రభావం రాబోయే తరాల క్రికెటర్లకు ఎల్లప్పుడూ దిక్సూచిగా, చిరస్థాయిగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆ మహనీయుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. క్రికెట్ ప్రపంచం ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తోంది.

Tags:    

Similar News