పీఎం సీఎం పదవులు పోయే బిల్లు...విపక్షాల భయం అక్కడే !

జస్ట్ నెల రోజులు జైలులో ఉంటే చాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు కట్ అయిపోతాయి. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగే వ్యవహారం.

Update: 2026-07-18 02:54 GMT

జస్ట్ నెల రోజులు జైలులో ఉంటే చాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు కట్ అయిపోతాయి. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగే వ్యవహారం. తీవ్రమైన నేరాలలో అరెస్టు అయి ముప్పై రోజుల పాటు జైలులో ఉన్నా లేదా పోలీస్ కస్టడీలో ఉన్నా కూడా వారి పదవికి ముప్పు తప్పదు. దీని మీద కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏకంగా రాజ్యాంగ సవరణను చేసి ఒక కీలక చట్టాన్నే తీసుకుని రావాలని అనుకుంటోంది. ఈ మేరకు ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లు ప్రవేశపెడతారు అనుకుంటే చివరి నిముషంలో వాయిదా పడింది.

బిల్లు చట్టం అయితే కనుక :

ఇక ఈ ప్రతిపాదిత బిల్లు కనుక పార్లమెంట్ లో ఆమోదం పొంది చట్టం అయితే కనుక కీలక స్థానాలలో ఉన్న వారి పదవులు పోయేందుకు పెద్దగా వేరే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. వారు నేరాలకు సంబంధించిన కేసులలో చిక్కుకుంటే మాత్రం రక్షించేది కూడా ఏదీ ఎక్కడా ఉండదని అంటున్నారు. ముప్పై రోజుల పాటు జైలు జీవితం గడిపితే చాలు 31వ రోజున ఆటోమేటిక్ గా మాజీలు అయిపోతారు. ఇక ఈ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే కనుక ఆలోచింపచేసేవిగానే ఉన్నాయి. ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్న వారు నేరం శిక్ష వంటి వాటి విషయంలో కనీసం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

రాజీనామా చేయకపోతే :

ఇక ఈ బిల్లులో సమయ పరిధి ని చూస్తే అరెస్ట్ లేదా జ్యుడీషియల్ కస్టడీ వరుసగా 30 రోజులు దాటకూడదు అని నిబంధన విధించారు. ఒక వేళ ఆ పరిమితిని దాటితే 30 రోజుల కస్టడీ తర్వాత ప్రధాని లేదా ముఖ్యమంత్రి అయినా సరే తమ పదవులకు వారికి వారుగానే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు రాజీనామా చేయకపోతే 31వ రోజున ఆటోమెటిక్‌గా వారి పదవి రద్దవుతుంది లేదా రాష్ట్రపతి అలాగే గవర్నర్ వారిని తొలగించవచ్చు అని బిల్లులో పొందుపరచారు.

జేపీసీ ఏమి తేల్చింది :

ఇదిలా ఉంటే ఇంతటి కీలకమైన బిల్లుని తీసుకుని వస్తున్నపుడు సమగ్రమైన అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం దీని మీద పార్లమెంటరీ సంయుక్త సంఘం జేపీసీని నియమించింది. ఈ జేపీసీ ఈ ప్రతిపాదిత బిల్లులో పొందుపరచిన అనేక అంశాలను పూర్తిగా పరిశీలన చెసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులను చేసింది. ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదిత బిల్లు విషయంలో అధికార, విపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ కక్షలతో ఎవరైనా ఈ చట్టాన్ని వాడుకుంటే ఇబ్బందులు వస్తాయన్న సందేహాలు విపక్షాల నుంచి వస్తున్నాయి. అందుకే దీనిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఇతరమైన అనేక నిబంధనలు పెట్టాలని కొందరు జేపీసీ సభ్యులు సూచించారు. దాంతో జేపీసీ కూడా ఈ బిల్లుని స్టడీ చేసి కొన్ని సూచనలు చేసింది. తీవ్రమైన నేరాల్లో అరెస్టయి 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధాని సీఎంలు లేదా మంత్రుల పదవులను ఆటోమేటిక్‌గా తొలగించే బదులు వారిని సస్పెండ్ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. . ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడితే ఆ సస్పెన్షన్ రద్దయ్యేలా క్లాజ్ ఉండాలని పేర్కొంది.

విస్తృత చర్చలు జరగాలి :

ఇక చూస్తే ఈ ప్రతిపాదిత బిల్లుకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తుది నిర్ణయం కోసం విస్తృత చర్చలు జరగాల్సి ఉంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఈ బిల్లు ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు అవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యగా నిలుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లుపై రాజకీయంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఇంకా జేపీసీ తుది నివేదిక ఖరారు కాలేదు. దీనిపై మరింత సమాలోచనలు జరపాల్సి ఉన్నందున జేపీసీ తన ముసాయిదా నివేదికను వాయిదా వేసింది.

Tags:    

Similar News