జైలుకెళ్తే పదవి ఖాళీ.. దేశ రాజకీయాల్లో కుదుపు తెచ్చిన బిల్లు వాయిదా.. ఎందుకంటే?
దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో మరోసారి వాయిదా పడింది.
దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో మరోసారి వాయిదా పడింది. నెల రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పొందని ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిని ఆటోమేటిక్‌గా వారి పదవుల నుంచి తొలగించేలా ప్రతిపాదించిన ఈ బిల్లుపై.. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఇంకా తన తుది నివేదికను ఖరారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
మరింత సమయం కోరిన జేపీసీ
శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో జేపీసీ సభ్యులు ఈ బిల్లుపై మరిన్ని సమగ్ర చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కమిటీ ఛైర్మన్ అపరాజిత సారంగి స్వయంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ "ఈ ప్రతిపాదిత బిల్లు కేవలం ఒక సాధారణ చట్టం కాదు. ఇది దేశ రాజ్యాంగ, రాజకీయ, న్యాయ వ్యవస్థలపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వివిధ రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో మరిన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నివేదికను సిద్ధం చేయాలని కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని తెలిపింది.
అసలు ఈ బిల్లులో ఏముంది?
ప్రస్తుత చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులు కోర్టు ద్వారా దోషులుగా తేలితేనే వారి పదవులు రద్దవుతాయి. కానీ ఈ కొత్త ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో అరెస్టయిన ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వరుసగా 30 రోజుల పాటు జైలులోనే ఉండి బెయిల్ పొందని పక్షంలో వారి పదవి స్వయంచాలకంగా రద్దవుతుంది. ప్రజాప్రతినిధులపై పెరుగుతున్న నేరారోపణలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడం.. వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలపడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
చర్చ మరింత ఆలస్యం
జేపీసీ నివేదిక సమర్పణ ఆలస్యం కానుండటంతో ఈ వర్షాకాల సమావేశాల అజెండాలో ఈ బిల్లు చేరే అవకాశం కోల్పోయింది. కమిటీ తన తుది నివేదికను పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తదుపరి చర్యలు తీసుకోనుంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు భవితవ్యం తేలడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.