కూటమిలో ఫ్రెండ్లీ కంటెస్ట్ తప్పదా ?

అందుకే ఏ మాత్రం తొందరపడకుండా టీడీపీతో దోస్తీ చేస్తూ ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటోంది. 2029 ఎన్నికల దాకా ఈ స్నేహాన్ని కొనసాగించాలనుకోవడం అందులో భాగమే.

Update: 2026-07-18 02:45 GMT

తెలుగుదేశం పార్టీ కూటమికి అసలైన సమస్య ఇపుడు ఎదురుకానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు అన్నీ ఐక్యంగా ముందుకు సాగడమే అతి పెద్ద సవాల్ కానుంది అని అంటున్నారు. దానికి కారణం జనసేన బీజేపీ మాదిరి పార్టీ కాదు, ఏపీలో మూడో ఫోర్స్ గా ఎమెర్జ్ అవాలని అనుకుంటోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండవ ఫోర్స్ గానే ఉండాలని జనసేన భావిస్తోంది. అయితే ఏపీలో టీడీపీ వైసీపీ రెండు బలమైన పార్టీలు పాతుకుని పోయి ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి ఎలిమినేట్ అయితే ఆ ప్లేస్ లోకి రావాలన్నది జనసేన ఆలోచన. అందుకే ఏ మాత్రం తొందరపడకుండా టీడీపీతో దోస్తీ చేస్తూ ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటోంది. 2029 ఎన్నికల దాకా ఈ స్నేహాన్ని కొనసాగించాలనుకోవడం అందులో భాగమే.

ఒకే భావ సారూప్యతతోనే :

అయితే జనసేన టీడీపీ ఒకే భావ సారూప్యత కలిగిన పార్టీలు. రెండింటి ఓటు బ్యాంకు దాదాపుగా ఒక్కటే. ఇక రెండింటికీ రాజకీయ కార్యక్షేత్రాలు హార్డ్ కోర్ రీజియన్లు కూడా ఒక్కటే కావడం విశేషం. పైగా రెండూ ప్రాంతీయ పార్టీలు. దేశంలో ఎక్కడా రెండు ప్రాంతీయ పార్టీలు కలసి పొత్తు పెట్టుకుని ఎక్కువ కాలం మనగలిగిన సందర్భాలు లేవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల పరిధి తక్కువగా ఉంటుంది. ఒకే ఏరియాలోనే అవి తలపడాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరికి వారిగా కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చోవాలని అనుకోరు. తాము బలపడి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని చూస్తారు. అయితే జనసేన వ్యూహాత్మకంగానే టీడీపీతో జట్టు కట్టింది అన్నది విధితమే అంటున్నారు.

బలం పెరిగితే కనుక :

అయితే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య పొత్తు వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎంపీ సీట్ల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతాయి. దాంతో వారికి కావాల్సింది వారికి ఇచ్చేస్తే లోకల్ గా తమదే రాజకీయ ఆధిపత్యంగా ఉంటుంది. అందుకే బీజేపీ వామపక్షాలు వంటి వాటితో టీడీపీకి పొత్తులు పెద్దగా సమస్యగా మారలేదు అఫ్ కోర్స్ జనసేనతో కూడా ఇప్పటిదాకా సమస్యలు రాలేదు అంటే దానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. ఆయన వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయాలన్న లక్ష్యం తోనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అది టీడీపీకి కలిసి వచ్చింది అని విశ్లేషణలు ఉన్నాయి. కానీ జనసేనలో మాత్రం క్యాడర్ లో పదవులు అధికారం కోసం ఆశించే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇది సహజం కూడా. పార్టీని విస్తరించాలనుకున్నపుడు వచ్చిన వారు పదవులే ఆశిస్తారు. మరో వైపు చూస్తే జనసేన కూడా తాము ఇంకా బలపడాలని అధికారం ఉండగానే గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా నిలబడాలని చూస్తోంది.

బలాబలాలు అంటే కనుక :

ఇదిలా ఉంటే క్షేత్ర స్థాయిలో బలాబలాలను బట్టి స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు జరగాలని జనసేన కోరుకుంటోంది. ఇదే కనుక ప్రమాణం అయితే టీడీపీ కంటే బలమైన పార్టీ క్షేత్ర స్థాయిలో మరొకటి ఉండదని అంతా ఒప్పుకోవాల్సిన విషయం. నాలుగున్నర దశాబ్దాలుగా టీడీపీ పటిష్టంగా ఉంది. దాంతో పాటు పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నారు. వారికి నూరు శాతం పదవులు ఇచ్చినా ఇంకా ఆశావహులు పార్టీలో ఉంటారు. కేవలం ఆశావహులు మాత్రమే కాదు సమర్ధులు అంగ బలం అర్ధబలం కలిగిన నాయకులు దిగువ స్థాయిలో ఎక్కువగా టీడీపీ నుంచే ఉన్నారు. మరి టీడీపీ స్థానిక పొత్తులలో సిం హ భాగం కోరుకుంటే మిగిలిన మిత్రుల సంగతి ఏమిటి అన్నదే చర్చగా ఉందిపుడు.

అంత ఈజీ మాత్రం కాదు :

ఏపీలో 2024 లో జరిగినవి 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ సీట్లకు ఎన్నికలు. ఇది కష్టతరమైన వ్యవహారం అయినా కూడా టాప్ లెవెల్ లో ఎక్కువ మంది ఆశావహులు ఉండరు కాబట్టి ఏదో కాటికి సర్దుబాటు చేసుకోగలిగారు. స్థానిక ఎన్నికలు అంటే గ్రౌండ్ లెవెల్ అన్న మాట. అలా దిగువకు వస్తున్న కొద్దీ నాయకులు బాగా పెరుగుతారు. వందలూ వేలు గా మారుతారు. వారిని సముదాయించి సర్దుబాటు చేయడం అన్నది పెద్ద సవాల్ గా ఉంటుంది. పైగా పదే పదే త్యాగాలు చేయడానికి ఎవరూ సిద్ధపడరు అని అంటున్నారు. మరి ఏమి చేయాలి అంటే కనుక ఎవరి బలాలు ఏమిటి అన్నది జనంలోనే తేల్చుకోవడానికి ఫ్రెండ్లీ కంటెస్టులు చేయడమే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎన్నికలు అయితే కూటమికి వైసీపీతో కంటే పొత్తులతోనే పెద్ద ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News