6 నెలల్లో 554 మంది భర్తలు హ‌తం.. లింగ రహిత చట్టాలపై బిగ్ డిబేట్!

సాధారణంగా గృహహింస, వైవాహిక వేధింపుల అనగానే సమాజంలో కేవలం మహిళలే బాధితులుగా కనిపిస్తుంటారు.

Update: 2026-07-18 03:45 GMT

సాధారణంగా గృహహింస, వైవాహిక వేధింపుల అనగానే సమాజంలో కేవలం మహిళలే బాధితులుగా కనిపిస్తుంటారు. కానీ స‌మాజం లోతుల్లోకి వెళితే అన్యాయంగా బ‌లైపోతున్న అభాగ్య పురుషుల గురించి అవ‌గ‌త‌మ‌వుతుంది. ఇన్నేళ్ల‌లో మ‌గ పురుగుల మ‌ర‌ణాల గురించి పెద్ద‌గా ఖాత‌రు చేయ‌ని సమాజం ఇప్పుడిప్పుడే భార్యా భాధితుల‌ను కూడా గుర్తించ‌డం మొద‌లు పెట్టింది. గురుగ్రామ్‌కు చెందిన `ఏకం న్యాయ్ ఫౌండేషన్` మీడియా వార్తల ఆధారంగా విడుదల చేసిన తాజా సంచలన రిపోర్ట్... కుటుంబ వ్యవస్థలోని మరో చేదు నిజాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై 14 వరకు కేవలం ఆరు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా మరణించార‌న్న రిపోర్ట్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు చట్టం ముందు స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే అనే రాజ్యాంగ సూత్రానికి అనుగుణంగా... ప్రస్తుత చట్టాల పునఃసమీక్ష అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

ఈ రిపోర్ట్ లోని ఘోరమైన లెక్క‌లు వివాహ బంధాలలోని చీకటి కోణాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. మరణించిన 554 మంది భర్తలలో దాదాపు 322 మంది తమ భార్యలు లేదా వారి ప్రియుల చేతిలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. మిగిలిన 232 మంది వైవాహిక వివాదాలు, భార్యల నుంచి ఎదురైన గృహహింసను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. దీని ప్రకారం చూస్తే... దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా... ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. భర్తల హత్యల్లో దాదాపు 60 శాతం వివాహేతర సంబంధాల వల్లే జరిగాయని... అలాగే ఆత్మహత్యల్లో 45 శాతం గృహహింస, మానసిక వేధింపుల వల్లే సంభవించాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఇటీవలి కాలంలో భార్యల అక్రమ సంబంధాలు లేదా కుటుంబ తగాదాల కారణంగా భర్తలు బలిపశువులవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టడం...నిద్రపోతున్న సమయంలో అంతమొందించడం... ఆపై మృతదేహాలను ముక్కలుగా నరకడం... పూడ్చిపెట్టడం... లేదా ప్రమాదాలుగా చిత్రీకరించి సజీవ దహనం చేయడం వంటి అత్యంత దారుణమైన సంఘటనలు తెలుగు నాట కూడా నమోదవుతున్నాయి. సమాజంలో పురుషులపై జరుగుతున్న ఇటువంటి మానసిక, శారీరక వేధింపుల వల్ల ఎంతో మంది భర్తలు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సామాజిక అపవాదుకు భయపడి ఎవరికీ చెప్పుకోలేక చివరికి ఆత్మహత్యను శరణ్యంగా భావిస్తున్నారు.

హింస లేదా వేధింపులు అనేవి కేవలం లింగాన్ని బట్టి జరగవు. బాధితులు ఎవరైనా వారికి సమానమైన చట్టపరమైన రక్షణ దక్కాలి. ప్రస్తుతం ఉన్న‌ కొన్ని రక్షణ చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా, కక్షసాధింపు చర్యల కోసం .. తప్పుడు ఆరోపణల కోసం మ‌హిళ‌లు దుర్వినియోగం చేస్తున్నార‌నే బ‌ల‌మైన‌ విమర్శలు న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. సమాజం ఏమనుకుంటుందోననే భయం... తమను కాపాడటానికి నిర్దిష్ట చట్టాలు లేకపోవడంతో పురుషులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. చట్టాలను జెండర్-న్యూట్రల్ (లింగ రహితం) గా మార్చడం వల్ల నిజమైన బాధితుడు ఎవరైనా.. స్త్రీ లేదా పురుషుడు ఇద్ద‌రికీ భయం లేకుండా న్యాయం పొందే అవకాశం ఉంటుంది.

అయితే.. భారతదేశం వంటి పితృస్వామ్య నేపథ్యం ఉన్న సమాజంలో శతాబ్దాలుగా అణచివేతకు గురైన మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తప్పనిసరనే వాదన కూడా బలంగా ఉంది. కానీ న్యాయం - ప్రాథమిక సూత్రం ప్రకారం చట్టం ఎవరికీ ఆయుధంగా మారకూడదు. అలాగని ఏ నిజమైన బాధితుడికీ రక్షణ లేకుండా పోకూడదు. అందువల్ల చట్టాల్లోని లొసుగులను తొల‌గిస్తూ.. తప్పుడు కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించే బలమైన వడపోత వ్యవస్థలను ఏర్పాటు చేయడం.. బాధితుల లింగ భేదంతో సంబంధం లేకుండా సమాన న్యాయం, మానసిక ఆరోగ్య మద్దతు అందించడం నేటి సమాజ సమతుల్యతకు ఎంతో అవసరమ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. `ఏకం` రిలీజ్ చేసిన రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇప్పుడు మ‌రోసారి చ‌ట్టాలు- స‌మ‌న్యాయంపై నెటిజ‌నుల‌లో బిగ్ డిబేట్ మొద‌లైంది.

Tags:    

Similar News