బహిరంగ ప్రదేశాల్లో పో*ర్న్ చూడొచ్చా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వానికే బంతి

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కలిసి ఈ పిటిషన్‌ను విచారించింది.

Update: 2026-07-18 07:25 GMT

దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో పో*ర్నోగ్రఫీ అశ్లీల కంటెంట్ వీక్షణను నిషేధించేలా ఒక జాతీయ విధానం రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ సమస్యను చిన్నచూపు చూడలేమని, ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశమే అయినప్పటికీ... దీనికి పరిష్కారం కోర్టు తీర్పు ద్వారా కాకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, సాంకేతిక నిపుణుల సూచనలు, సంబంధిత శాఖల చర్యల ద్వారా రావాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కలిసి ఈ పిటిషన్‌ను విచారించింది. సామాజిక కార్యకర్త బి.ఎల్. జైన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ సంబంధిత ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.

పిటిషనర్ వాదనలు ఏమిటి?

అడ్వొకేట్ వరుణ్ ఠాకూర్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌లో దేశవ్యాప్తంగా పో*ర్నోగ్రాఫిక్ కంటెంట్ వీక్షణను నియంత్రించేందుకు సమగ్ర జాతీయ విధానం రూపొందించాలని కోరారు. పిటిషనర్ లేవనెత్తిన ప్రధానాంశాలు చూస్తే.. ముఖ్యంగా చిన్నపిల్లలు, మైనర్లు ఇలాంటి అశ్లీల కంటెంట్‌కు సులభంగా లోనుకాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అశ్లీల కంటెంట్‌నైనా వీక్షించకుండా పూర్తిగా నిషేధించాలి. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పో*ర్నోగ్రఫీకి ప్రాప్యత పెరిగిందని, దీని వల్ల వ్యసనం పెరగడమే కాకుండా.. సమాజంలో లైంగిక నేరాల పెరుగుదలకు కూడా ఇది ఒక ముఖ్య కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార సాంకేతిక చట్టం–2000లోని సెక్షన్ 69A ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సమాచారాన్ని నిరోధించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని, వాటిని వినియోగించి తగిన చర్యలు తీసుకోవచ్చని వాదించారు.

సుప్రీంకోర్టు స్పందన.. బంతి కేంద్రం పరిధిలోకి..

ఈ అంశంపై లోతుగా చర్చించిన సుప్రీంకోర్టు.. ప్రస్తుతం ఇందులో న్యాయపరంగా తీర్పు ఇవ్వాల్సిన ప్రశ్న లేదని స్పష్టం చేసింది. ఇలాంటి సామాజిక, సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే కేవలం కోర్టు ఆదేశాలు సరిపోవని అభిప్రాయపడింది. దీనికోసం "విధానపరమైన సంస్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వంటి సంబంధిత సంస్థల నిపుణుల సూచనలు చాలా అవసరం" అని ధర్మాసనం పేర్కొంది.

భవిష్యత్తుపై ఉత్కంఠ

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ సామాజిక సమస్యపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులపై పడింది. బహిరంగ ప్రదేశాల్లో పో*ర్నోగ్రఫీ వీక్షణను నియంత్రించేందుకు.. స్మార్ట్‌ఫోన్‌లలో అశ్లీల కంటెంట్ ఫిల్టరింగ్ కోసం ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి కొత్త మార్గదర్శకాలు లేదా కఠినమైన చట్టాలు తీసుకువస్తుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Tags:    

Similar News