ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ కి మోడీ శ్రీకారం
ఎట్టకేలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మకమైన ఎయిర్ పోర్టుని ప్రారంభించనున్నారు.
ఎట్టకేలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మకమైన ఎయిర్ పోర్టుని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోడీ డేట్ ఫిక్స్ చేస్తూ సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జూలై 5న ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ డేట్ మారింది. జూలైలో అనేక ఇతర తేదీలను కూడా చెప్పినా ఆఖరికి ఆగస్ట్ 1 అన్నదే ఖరారు అయింది.
చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం
ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం జరుగుతోంది కాబట్టి చరిత్రలో నిలిచేలా ఈ కార్యక్రమం మొత్తం జరగాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోంది. దానిని సంబంధించి ఇపుడు సన్నాహాలు వేగవంతం అయ్యాయి. మరో వైపు చూస్తే భోగాపురం విమానాశ్రయంపై సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీకి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని బాబు అన్నారు.
కొత్త అవకాశాలు తీసుకొస్తుంది :
భోగాపురం ఎయిర్ పోర్టు ఎన్నో కొత్త అవకాశాలు తీసుకుని వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోర్టులు హైవేలు పరిశ్రమలు ఎయిర్ పోర్టు టూరిజం వంటి భారీ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్ అని బాబు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రా ప్రాంత స్థితిగతులను ఎయిర్ పోర్టు సమూలంగా మార్చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీతోనే మొదలై :
ఇదిలా ఉంటే 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. తిరిగి టీడీపీ హయాంలోనే ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం చేసుకోవడం విశేషం. కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ ఎయిర్ పోర్టు పూర్తి కావడం మరో విశేషం. ఇక సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని కనీ వినీ ఎరుగని తీరులో ఈ వేడుక సాగాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఉత్తరాంధ్రాకు గేమ్ చేంజర్ :
ఇక ఉత్తరాంధ్రా ఎకనమిక్ యాక్టివిటీ ఈ ఎయిర్ పోర్టుతో ఉరుకులు పరుగులుపెడుతుందని భావిస్తున్నారు. అలాగే ఆపరేషన్స్ ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని, సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ది పొందుతారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం విమానయాన రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామికపరంగా కూడా ఉత్తరాంధ్రా ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో ఈ ఎయిర్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో వచ్చిన శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో నేడు భోగాపురంతో ఆ ప్రాంతంలోనూ అటువంటి మార్పులే తెస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఎకనమిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.