బండి ఈటెల షేక్ హ్యాండ్...గతం గతహ !
గతం ఎపుడూ గతమే. కానీ అది వర్తమానంలో కూడా కొనసాగుతుంది. అనుభవాలుగా జ్ఞాపకాలుగా దాని ప్రభావం ఉంటుంది.
గతం ఎపుడూ గతమే. కానీ అది వర్తమానంలో కూడా కొనసాగుతుంది. అనుభవాలుగా జ్ఞాపకాలుగా దాని ప్రభావం ఉంటుంది. మౌన మునులు అయితే గతం గతహా అని అనేసుకోగలరు, కానీ రాజకీయ జీవులు అలా అంత ఈజీగా మరచిపోగలరా అంటే తాత్కాలికంగా అయినా చేతులు కలిపినా రాజకీయ మేలు చాలానే ఉంటుంది అన్నది చరిత్ర నిరూపించింది. 2023లో తెలంగాణాలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు అంతా తమ మధ్య విభేదాలు మరచి అంతా ఒక్కటి అయ్యారు. ఫలితంగా పార్టీకి అధికారం దక్కింది. ఇపుడు బీజేపీ కూడా అదే విధంగా తెలంగాణాలో రిపేర్లకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్కడ లోపం ఉంది, మరెక్కడ శాపం ఉంది అన్నది తవ్వి తీసి మరీ సరిదిద్దుకునే చర్యలకు ఉపక్రమిస్తోంది.
బండి వర్సెస్ ఈటెల :
ఈ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అంతే కాదు ఇద్దరూ రాజకీయంగా సీనియర్ నేతలే. ఈటెల మంత్రిగా ఉద్యమ నేతగా ఉంటే బండి బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి వచ్చారు. అంతే కాదు ఆయన కేంద్ర మంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఈ ఇద్దరి రాజకీయ కార్యక్షేత్రం కూడా ఉమ్మడి కరీం నగర్ జిల్లా. దాంతో ఈటెల బీజేపీలో చేరిన తరువాత రెండు వర్గాలుగా జిల్లా బీజేపీ రాజకీయం మారింది. ఈటెల వర్సెస్ బండి అన్నట్లుగా రాజకీయం స్టార్ట్ అయింది. ఈటెల వర్గం బలంగా కరీం నగర్ జిల్లాలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ కూడా అక్కడే ఉంది. దాంతో ఈటెల బీజేపీలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బండి వర్గం గడి కొడుతోంది అన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈటెల బండి పరోక్షంగా ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ వచ్చిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.
పార్టీ పుంజుకుంటున్న వేళ :
తెలంగాణా మీద బీజేపీకి ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలలో బీజేపీ పట్ల సానుకూలత ఉందని దానిని సొమ్ము చేసుకోవాల్సిన తరుణంలో కీలక నేతల మధ్య విభేదాలు ఉండడం మంచి పరిణామం కాదని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే తొలి ప్రయత్నంగా బండిని ఈటెలను కలసికట్టుగా ఉంచాలని నిర్ణయించింది అని అంటున్నారు. ఈ ఇద్దరు అగ్ర నేతలు చేతులు కలిపితే కనుక తెలంగాణాలో ముఖ్య ప్రాంతాలలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక అరుదైన సన్నివేశం అయితే చోటు చేసుకుంది.
పార్టీ లైన్ లోనే అంటూ :
ఇదిలా ఉంటే తెలంగాణా బీజేపీ వ్యవహారాల ఇంచార్జి అభయ్ పాటిల్ ఈ ఇద్దరు నేతలను పిలిపించుకుని మరీ రాజీ ఫార్ముల సెట్ చేశారు అని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈటెల బండిలను పక్క పక్కనే కూర్చోబెట్టి గతం గతహా అని చెప్పిన అభయ్ పాటిల్ గతంలో ఏమి జరిగినా ఇక మీదట వాటి ప్రస్తావన అన్నది వద్దే వద్దు అని స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించే ఆలోచన చేయాలని కూడా అభయ్ పాటిల్ సూచించారు అని అంటునారు. పార్టీ చెప్పినట్లుగానే ఎవరైనా వినాలని పార్టీ లైన్ లో నడవాల్సిందే అని కూడా అభయ్ పాటిల్ చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. మరి ఈ ఐక్యత కలిసికట్టు తనం కనుక ముందు ముందు కొనసాగితే బీజేపీకి తెలంగాణాలో మంచి రోజులు వచ్చినట్లే. చూడాలి మరి ఏమి జరుగుతుందో.