పవనే గేమ్ చేంజర్....2029 సంగతేంటి ?

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక విభజన ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది.

Update: 2026-07-18 22:30 GMT

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక విభజన ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. అంతే కాదు సామాజిక సమీకరణలు మరింత ముఖ్య పాత్ర పోషించడం కూడా ప్రారంభం అయింది. ఇక ఒక్కసారి చూసుకుంటే రెండు పార్టీల వ్యవస్థ ఏపీలో ఇంకా కొనసాగుతున్నా మూడవ పార్టీగా ముందుకు వచ్చిన జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఏపీ రాజకీయాల రాతను మారుస్తున్నారు. ఆయన చేతిలోనే ఏపీ రాజకీయం మొత్తం సాగుతోంది. పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా పవర్ స్టార్ గా రీల్ లైఫ్ లో ఉంటూ రియల్ లైఫ్ లో పొలిటీషియన్ గా తన పవర్ ఏంటో గడచిన 12 ఏళ్ళుగా ఏపీ రాజకీయాల్లో అధికంగా చూపిస్తున్నారు.

ప్రభుత్వాల ఏర్పాటు వెనక :

ఇక ఒక్కసారి 2014 దాకా వెళ్తే ఆనాడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి టీడీపీకి బీజేపీకి గట్టి మద్దతు ప్రకటించారు. ఆ తరువాతనే ఏపీలో మొత్తం రాజకీయం మారిపోయింది అని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు నెల రోజులు ముందు దాకా వైసీపీకి ఎడ్జ్ ఉందని సర్వేలు అనేకం వచ్చాయి. ఒక విధంగా వైసీపీకి మంచి హైప్ ఉన్న వేళ పవన్ ఇచ్చిన మద్దతు టీడీపీ ఇక్కడ గెలవడానికి బీజేపీ కూడా ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఎంతగానో దోహదపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2019 ఎన్నికలను తీసుకుంటే అదే పవన్ జనసేన ఒంటరిగా బరిలోకి దిగింది. దాంతో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. బీజేపీకి డిపాజిట్లు గల్లంతు కావడమే కాదు ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

పవన్ కాదు సునామీ :

ఈ మాటలు ఎన్డీయే పక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా జనసేనానిని ఉద్దేశించి అన్నవి. పవన్ గురించి చెబుతూ ఆయన దేశం మొత్తంలో ఉన్న ఎన్డీయే మిత్ర పక్షాలకు ఆయన్ని అలా పరిచయం చేశారు. ఒక విధంగా 2024 ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి ఏపీలో టీడీపీ జనసేన ఎంపీల బలమే కారణం. మరి ఈ బలం ఎలా వచ్చింది అంటే పవన్ తాను ఎంతగానో తగ్గి మరీ సీట్లను త్యాగం చేసి కుదిర్చి పెట్టిన కూటమి ఒప్పందం అని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది అంటున్నారు. ఇక కూటమి ఎపుడైతే స్ట్రాంగ్ గా ముందుకు వచ్చిందో ఆనాడే వైసీపీ ఓడిపోతుందని అందరికీ అర్ధం అయిపోయింది. అయితే తేడా అల్లా వైసీపీ మరీ ఇంత దారుణంగా ఓటమి పాలు అవుతుందని ఎవరూ అనుకోలేదు.

2029 లో సైతం :

ఇదే వరసలో చూస్తే 2029 ఎన్నికల్లో సైతం పవన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కూటమితో కలసి ఉంటే లెక్క వేరుగా ఉంటుంది ఆయన విడిగా పోటీ చేస్తే లెక్క మరోలా ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి అయితే తన మాజీ పార్టీ వైసీపీ గెలుపు అవకాశాల గురించి ఆ మధ్య మాట్లాడుతూ కూటమిగా ఉన్నంత కాలం వైసీపీకి విజయావకాశాలు కష్టమే అని పేర్కొన్నారు. కూటమి కనుక విచ్చిన్నం అయితే కచ్చితంగా వైసీపీ గెలుపు సాధిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏపీలో ఏ పార్టీ అధికారలోకి రావాలన్నా ఎవరూ ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా డిసైడ్ చేస్తే మెయిన్ ఫ్యాక్టర్ జనసేన దాని అధినేత పవన్ అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

జనసేన ఆలోచనలు :

అయితే జనసేన మరి కొద్ది నెలలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని చూస్తోంది. అంతే కాదు 2029 ఎన్నికల నాటికి సంస్థాగతంగా తన పార్టీని విస్తరించాలని చూస్తోంది. అంటే 2029 ఎన్నికల్లో జనసేన కేవలం ఎవరు అధికారంలో ఉండాలో ఎవరి ప్రతిపక్షంలో ఉండాలో డిసైడ్ చేయడం మాత్రమే కాదు తాను రాజ్యాధికారం చేపట్టేందుకు మార్గాలని కూడా అన్వేషిస్తోంది అని అంటున్నారు. ఈ ప్రక్రియలోనే కూటమిలో సర్దుబాట్లు అన్నవి సాఫీగా సాగితే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, లేకపోతే 2029 ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News