రేవంత్ సారు..ఇచ్చి పడేస్తున్నారు !

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదునైన మాటలతో ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టగలిగే దిట్ట. ఆయన పేల్చే పంచులు ఘాటుగానూ గట్టిగానూ ఉంటాయి.

Update: 2026-07-19 04:35 GMT

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదునైన మాటలతో ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టగలిగే దిట్ట. ఆయన పేల్చే పంచులు ఘాటుగానూ గట్టిగానూ ఉంటాయి. ఆయన సెటైర్లు ఎలా గుచ్చుకోవాలో ఎవరికి గుచ్చుకోవాలో ఎక్కడా గురి తప్పకుండా వెళ్ళి లక్ష్యాన్ని చేదిస్తాయి. రేవంత్ రెడ్డికి ఉన్న అద్భుతమైన వరం బోరు కొట్టించకుండా ప్రసంగాలు చేయడం. ఆయన మంచి వక్త. ఎంతసేపు మాట్లాడినా విన్న వారు ఇంకా వినాలనుకుంటారు ఇక ప్రత్యర్థుల మీద రేవంత్ రెడ్డి మాటల దూకుడు విమర్శలతో ఆడే చెడుగురు వేరే లెవెల్ అని చెప్పాల్సిందే.

ధీటుగా సరిసాటిగా :

ఇక రేవంత్ రెడ్డికి తెలంగాణా రాజకీయ మైదానంలో ధీటుగా సరిసాటిగా ప్రసంగాలు చేసే ప్రత్యర్ధి నేతలు పెద్దగా ఎవరూ లేకపోవడం గొప్పగా అనుకూలించే అంశం. ఆయన తెలంగాణా యాసలో ఆ మాండలీకాలతో సామెతలను జోడిస్తూ సందర్భానుసారం పాత విషయాలను జత చేస్తూ బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడే తీరుతోనే అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఏ విషయం మీద అయినా బీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలకు అంతే ధీటుగా బదులీయడమే కాదు అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుకే కదా అన్నట్లుగా ఆలవోకగా ఆయన చేస్తున్న విమర్శలు ఇస్తున్న కౌంటర్లు అయితే జనంలోకి బలంగానే వెళ్తున్నాయి.

వీగిపోతున్న విమర్శలు :

రేవంత్ రెడ్డి మీద ప్రత్యర్ధులు ఎన్నో విమర్శలు చేస్తారు. సబ్జెక్ట్ తో కూడా రెడీగా ఉంటారు. అన్నీ చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు గట్టిగా బట్టీ పట్టి మరీ ప్రయోగిస్తూంటారు. అయితే ఎంతటి సుదీర్ఘమైన విమర్శలు తన మీద చేసినా లేదా ఆ విమర్శలలో ఎంతటి తీవ్రత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అయితే ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంటారు. దేనికైనా రెడీ అన్నట్లుగా ఆయన జవాబులు అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. తాజాగా నిరుద్యోగుల ఇష్యూ మీద బీఆర్ఎస్ ఆందోళన చేసింది. తెలంగాణాలో యువతకు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గట్టిగానే విమర్శలు సంధించారు. దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ అయితే బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ డోస్ గానే ఉందని అంటున్నారు.

ఉద్యోగాలు అంటే మీకేగా అంటూ :

గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికో రేవంత్ రెడ్డి గటగటా చెప్పేశారు. కేటీఆర్ కి హరీష్ రావుకి కవితకు వినోద్ కుమార్ కి, బంధువులకే కదా ఉద్యోగాలు ఇచ్చారు అంటూ ఎకసెక్కం చేశారు. ఎన్నికల్లో ఓడినా కూడా వేరే పదవులలో తీసుకుని వచ్చి నియామక పత్రాలు అర్జంటుగా ఇచ్చిన ఘనత కేసీఆర్ దే కదా అని కూడా కౌంటర్లేశారు. నాలుగు కోట్ల జనాలు పదేళ్ళ పాటు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం తెలంగాణా సమాజానికి ఏమిచ్చింది అంటూ రేవంత్ రెడ్డి సూటి ప్రశ్ననే సంధించారు.

ఆయనతో కష్టమేనా :

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండగా బీఆర్ఎస్ కి ధీటుగా ఎదుర్కోవడం కష్టమేనా అన్న చర్చ ముందుకు వస్తోంది. మాట్లాడితే చాలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ని సైతం తెచ్చి మరీ జనాల ముందు అంతా పెడుతున్నారు. పైగా ఎలా చెప్పాలో అలా చెబుతున్నారు. ఆయన ప్రసంగాలు అంటేనే అట్రాక్టివ్ గా ఉంటాయి. దాంతో రేవంత్ ఏమి చెప్పినా ఏ విమర్శ చేసినా జనంలోకి బలంగా వెళ్ళిపోతోంది. దానికి తోడు కేసీఆర్ కుటుంబానికి మరోసారి అధికారం దక్కనిచ్చే సమస్యే లేదు అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న భీషణ ప్రతిజ్ఞలు కూడా గులాబీ పార్టీని ఆలోచనలో పడేస్తున్నాయి. మాటకారి వ్యూహకర్త అయిన రేవంత్ రెడ్డి తో పెట్టుకోవడం అంటే ఒకటి అని నాలుగు అందుకోవడమే అన్నట్లుగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News