ఏపీలో ఎన్నికల హీట్...ఢిల్లీకి చంద్రబాబు !

ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 24న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఆయన పర్యటన ఒక రోజు మాత్రమే ఉంటుందని అంటున్నారు.

Update: 2026-10-24 03:25 GMT

ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ మామూలుగా లేదు. నామినేషన్ల పర్వంలోనే తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కి మరీ వైసీపీ ఎట్టకేలకు నాలుగు చోట్ల రీ నామినేషన్లకు రిలీఫ్ తెచ్చుకుంది. అదే సమయంలో సుప్రీం కోర్టు తీర్పుతో జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చకు వస్తోంది. ఇంకో వైపు చూస్తే నామినేషన్ పర్వంలోనే ఇలా ఉంటే పోలింగ్ దాకా ఏ రకమైన అలజడి ఉంటుందో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక తొలిదశ పోలింగ్ రీ షెడ్యూల్ చేయబడింది. నవంబర్ 1 దాకా వెళ్ళింది. దాంతో డిసెంబర్ దాకా లోకల్ ఫైట్ హీట్ పెద్ద ఎత్తున ఉంటుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల వేడి ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. దాంతో ఎందుకు ఏమిటి అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఒక రోజు పర్యటన :

ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 24న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ఆయన పర్యటన ఒక రోజు మాత్రమే ఉంటుందని అంటున్నారు. శనివారం ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు అదే రోజు అర్ధరాత్రికి అమరావతికి తిరుగు పయనం అవుతారని అంటున్నారు. ఢిల్లీలో బాబు న్‌పథ్ ప్రాంతంలో నిర్వహించనున్న ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉందని చెబుతున్నారు.

ఏపీ రాజకీయం మీద :

మరో వైపు చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి ఢిల్లీ పెద్దలకు తెలుసు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఆ మధ్య ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అయితే ఎక్కువ సీట్లు సాధించాలని పార్టీ నేతలకు చెప్పి వెళ్ళారు. విశాఖ మేయర్ పీఠం మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే అనంతపురం రాజమండ్రి మేయర్ పదవులు బీజేపీకి పొత్తులో దక్కాయి. దాంతో పాటు న్యాయమైన వాటానే దక్కింది అంటున్నారు. ఇక ఏపీలో స్థానిక పోరులో నామినేషన్ల పర్వంలో చోటు చేసుకుంటున్న ఘర్షణల గురించి ఢిల్లీ కేంద్ర బీజేపీ పెద్దలకు తెలుసా లేదా అంటే తెలుసు అనే అంటున్నారు.

అమిత్ షా తో భేటీ :

ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు అని ప్రచారం సాగుతోంది. అలాగే వీలైతే మరింతమంది కేంద్ర పెద్దలను కలుస్తారు అని అంటున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియచేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ప్రాంతీయ జాతీయ రాజకీయాల గురించి చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు ఢిల్లీ టూర్ అయితే ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News