కోడలు గెలుపు కోసం బొత్స కొత్త వ్యూహం

ఇప్పటిదాకా బొత్స కుమార్తె అనూష, కుమారుడు సందీప్ ల గురించే ఎక్కువగా చర్చ సాగింది. కానీ సడెన్ గా కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

Update: 2026-10-24 03:22 GMT

ఉత్తరాంధ్రాలో ప్రముఖ బీసీ నేత, మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ ఎందరికో రాజకీయంగా ఆశ్రయం కల్పించారు. ఆయన శిష్యులు ఎందరో ఉత్తరాంధ్రాలో ఉన్నారు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులను కూడా ఆయన రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇపుడు అదే వరుసలో తన కోడలు పూజితను బొత్స తొలిసారి రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారు. ఇది చాలా అనూహ్యంగా సైలెంట్ గా జరిగిపోయింది. ఇప్పటిదాకా బొత్స కుమార్తె అనూష, కుమారుడు సందీప్ ల గురించే ఎక్కువగా చర్చ సాగింది. కానీ సడెన్ గా కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా :

ఇక బొత్స కోడలు పూజిత గరివిడి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. గరివిడి బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లి లో ఉంది. ఇక్కడ బొత్స బంధుగణం ఎక్కువగా ఉన్నారు. అలాగే ఆయన సామాజిక వర్గం వారు ఎక్కువే. దాంతో బొత్స చీపురుపల్లి నుంచే అయిదు సార్లు పోటీ చేశారు. ఈ మండలాల్లో ఉన్న పట్టు వల్లనే ఆయన మూడు సార్లు గెలిచారు. ఇక తన కోడలిని కంచుకోట లాంటి గరివిడి జడ్పీటీసీ స్థానం నుంచి బొత్స దింపడం వ్యూహాత్మకం అని అంటున్నారు. ఇదే క్రమంలో ఆయన ప్రచారాన్ని కూడా వినూత్నంగా ప్రారంభించారు.

సోషల్ మీడియా వేదికగా :

నామినేషన్ ఇలా దాఖలు చేసిందో లేదో బొత్స కోడలు పూజిత ఎన్నికల ప్రచారం మొదలైపోయింది. గరివిడి మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు బొత్స పూజితను అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని సోషల్ మీడియాలో బొత్స ప్రచారం స్టార్ట్ చేశారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆయన గుర్తు చేశారు. ఇక పూజిత కూడా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ గరివిడి మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో జనం ముందుకు వస్తున్నారని బొత్స చెప్పారు. ఆమెను ప్రజలు తమ ఇంటి బిడ్డగా ఆదరించి తమ నమ్మకాన్ని ఆశీర్వాదాన్ని అందించాలని బొత్స కోరారు. ఆమె ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే అవకాశం కల్పించండని కోరారు. అందువల ప్రజలు తమ అమూల్యమైన ఓటు ఆమెకు వేసి ఆశీర్వాదిస్తే అదే ఆమెకు కొండంత బలంగా బొత్స పేర్కొన్నారు.

కోడళ్ళ వెనక మామలు :

ఇదిలా ఉంటే గరివిడి మండలం నుంచి టీడీపీ తరఫున జెడ్పీటీసీగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య కూడా పోటీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కిమిడి కుటుంబానికి సైతం మంచి పట్టు ఉంది. అంతే కాదు ఆయన చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో బొత్సను ఓడించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయనకు తన సొంత నియోజకవర్గంలో కోడలిని గెలిపించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. దాంతో తెర ముందు కోడళ్ళు బరిలో ఉన్నా తెర వెనక మామలే వ్యూహకర్తలు అని అంటున్నారు. వరి మధ్యనే అసలైన రాజకీయ పోరు సాగనుంది అని అంటున్నారు. చూడాలి మరి ఇద్దరు మామలలో ఏ మామ విజయం సాధిస్తారు అన్నది.

Tags:    

Similar News