మరోసారి సుప్రీంకు వైసీపీ ?
ఈ విధంగా ఏవో కొన్ని వార్డులు నాలుగు ప్రాంతాలలో పరిమితం చేసి రీనామినేషన్ల ప్రక్రియను చేశామని ఎస్ఈసీ చెప్పడం వల్ల తమకు అన్యాయమే తప్ప ఒరిగేది ఏముందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘర్షణల మీద తమకు నామినేషన్లు దాఖలు చేయకుండా చేస్తున్నారు అంటూ వైసీపీ మండిపడుతోంది. దీని మీద ఈ నెల 19న సుప్రీం కోర్టుని వైసీపీ ఆశ్రయిస్తే 21న సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. అందులో అయితే వైసీపీ అభ్యంతరాల మీద పరిశీలించి గడువు మరో నలభై ఎనిమిది గంటల పాటు నామినేషన్లకు పొడిగించాలని ఆదేశించింది. అయితే దాని మీద అధ్యయనం చేసిన ఎస్ఈసీ 19 చోట్ల వైసీపీ పూర్తి స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కోరితే కేవలం నాలుగు చోట్ల అది కూడా పరిమిత స్థాయిలోనే కొన్ని వార్డులకు మాత్రమే చాన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ మండిపడుతోంది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. సుప్రీం కోర్టు ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదని అన్నారు. పైగా ఎంపీటీసీ జెడ్పీటీసీలలో సైతం నామినేషన్ల సందర్భంగా ఇదే రకమైన పరిస్థితి ఎదురైంది అని విమర్శించారు.
న్యాయ పోరాటం కోసం :
నిజానికి చూస్తే నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ అభ్యర్ధులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ 19 మున్సిపాలిటీలలో పూర్తి స్థాయిలో కొత్తగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృపితో ఉన్న వైసీపీ మరోసారి సుప్రీం కోర్టుకి ఇదే విషయం మీద వెళ్ళాలని చూస్తోంది. పూర్తి ఆధారాలతో మళ్ళీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ ఇప్పుడు తదుపరి న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తోంది అని ప్రచారం సాగుతొంది.
ఇవేమి ఎన్నికలు అంటూ :
ఇక జగన్ మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలను సంధించారు. ఇవేమి ఎన్నికలు అని ఆయన నిలదీశారు. కడప కార్పోరేషన్ లో 66 వార్డులు ఉంటే కొత్తగా నామినేషన్ల స్వీకరణకు 11 వార్డులకు మాత్రమే అవకాశం ఇస్తే ఎలా వైసీపీకి న్యాయం చేసినట్లు అని ప్రశ్నించారు. అలాగే తిరుపతిలో 18 వార్డులలో రాజంపేటలో 11 వార్డులలో అవకాశం ఇచ్చారని మరి మిగిలిన వార్డులు అన్నీ ఏకగ్రీవం చేసుకున్న పక్షంలో ఇక అధికార కూటమిదే విజయం కదా మళ్ళీ ఈ రీ నామినేషన్ల ప్రక్రియ వల్ల వైసీపీకి ఏమి న్యాయం జరిగింది అని ఆయన గట్టిగానే అడుగుతున్నారు. అలాగే తాము సుప్రీం కోర్టుకు వెళ్ళి పూర్తి ఆధారాలు సమర్పించిన మిగిలిన 15 ప్రాంతాల సంగతేంటి అంటోంది. పుంగనూరు, దర్శి జిల్లాలకు సంబంధించి నిర్దిష్ట ఉపశమనం లేకపోవడాన్ని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అన్యాయమే అంటూ :
ఈ విధంగా ఏవో కొన్ని వార్డులు నాలుగు ప్రాంతాలలో పరిమితం చేసి రీనామినేషన్ల ప్రక్రియను చేశామని ఎస్ఈసీ చెప్పడం వల్ల తమకు అన్యాయమే తప్ప ఒరిగేది ఏముందని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పరిమిత పరిధిని సవాలు చేయడానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను వైసీపీ ఇపుడు చురుకుగా పరిశీలిస్తోందని అంటున్నారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తీఅ అధినాయకత్వం న్యాయ నిపుణులను ఈ విషయంలోసంప్రదిస్తోందని అంటున్నారు. దాంతో సుప్రీంకోర్టులో మరో విడత కేసు ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విచారణ 27న :
ఇక ఈ విషయంలో ఇప్పటికే దాఖలైన వైసీపీ పిటిషన్ను సుప్రీంకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది. ఇపుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం మీద వైసీపీ తన అభ్యంతరాలని దీనికి జోడించనుంది అని అంటున్నారు. దాంతో ఈ వివాదంలో ప్రధానాంశాలుగా ఇవే నిలిచే అవకాశం ఉందని అంటున్నారు అయితే సుప్రీంకోర్టు కేవలం ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేసిందని కూటమి నాయకులు చెబుతున్నారు. అందుకే ఎస్ఈసీ అన్ని విషయాలను గ్రౌండ్ లెవెల్ లో నివేదికల ఆధారంగా తీసుకుందని, అలాగే కోర్టు జారీ చేసిన ఆదేశాల పరిధిలోనే ఎస్ఈసీ వ్యవహరించిందని వారు వాదిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.