ఫ్లాష్ బ్యాక్ ముచ్చట : ముద్రగడకు ఫోన్ చేసి షాక్ ఇచ్చిన నేదురుమల్లి !
ముద్రగడ పద్మనాభం ఇటీవల దివంగతులు అయ్యారు. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న ఈ దిగ్గజ నాయకుడు అధికారానికి పదవులకు మాత్రం ఎంతో దూరంగానే ఉన్నారు.
ముద్రగడ పద్మనాభం ఇటీవల దివంగతులు అయ్యారు. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న ఈ దిగ్గజ నాయకుడు అధికారానికి పదవులకు మాత్రం ఎంతో దూరంగానే ఉన్నారు. ఆయన రెండు సార్లు మంత్రి అయ్యారు కానీ ఎక్కువ కాలం పని చేయలేకపోయారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ శాఖను చూసినా తక్కువ కాలమే పనిచేశారు. ఇక 1989లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయినా ఏడాది మాత్రమే ఆ అమాత్య పదవి ఉంది. అయితే ముద్రగడ ఎక్కువ కాలం ఉద్యమ నేతగానే ఉంటూ తన సొంత సామాజిక వర్గం కోసం పాటుపడ్డారు. అదే సమయంలో ఆయన మంత్రి పదవులకు ఇతర పదవులకు ఏనాడు ఎవరినీ అడిగింది లేదని చెబుతారు. ఆయనకి ఇవ్వాలని ఇచ్చిన పదవులే ఆయన అందుకున్నారు.
పేర్ల కన్ఫ్యూజన్ తోనే అలా :
ఇదిలా ఉంటే 1989లో అధికారంలోకి వచ్చిన చెన్నారెడ్డి 1990 లో దిగిపోయారు. ఆయన తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన మంత్రి వర్గ జాబితా తయారు చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పంతం పద్మనాభాన్ని మంత్రి గా తీసుకోవాలని అనుకున్నారు. ఇక 1989లో పంతం పద్మనాభం పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్రగడ పద్మనాభం ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరూ ఒకే జిల్లా ఒకే ప్రాంతం వారు పక్క పక్క ఊళ్ళే కావడం విశేషం. అయితే ఇదే పద్మనాభం పేరు అయితే ఆనాటి ప్రభుత్వ పెద్దలకు కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ రోజులలో సెల్ ఫోన్లు లేనందువల్ల పంతం పద్మనాభానికి ట్రంకాల్ బుక్ చేయమని నేదురుమల్లి అధికారులను కోరారు. వారు పంతం పద్మనాభం అనుకుని ముద్రగడకు ట్రంకాల్ కలిపారు.
మంత్రిగా తీసుకుంటున్నాను అంటూ :
ఇక ఫోన్లో నేదురుమల్లి అవతల ఉండడంతో ముద్రగడ ఎత్తుకున్నారు. మీకు మంత్రి పదవి ఇస్తున్నాను, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని చెప్పి నేదురుమల్లి ఫోన్ పెట్టేశారుట. దాంతో ఈ ఫోన్ కాల్ ని స్వయాన తానే విన్నది ముద్రగడ అన్నది తరువాత కానీ ఆనాటి ప్రభుత్వ అధికారులకు తెలియదు. అయితే పంతానికి మంత్రి పదవి అన్నది ముద్రగడకు కూడా తరువాత తెలిసింది అంటారు. ఇక అప్పటికే మంత్రిగా చేసిన ముద్రగడను కాదని పంతం పద్మనాభానికి చాన్స్ ఇచ్చిన నేదురుమల్లి అదే విషయం ముద్రగడకే పొరపాటున చెప్పేశారు అని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లను గురించి తాజాగా చర్చిస్తూ చెప్పుకుంటున్నారు. ఆ తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పంతం పద్మనాభం పనిచేశారు. అంతే కాదు 1991లో పంతం పద్మనాభం ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు జరిగాయి కూడా.