ప్రధాని మోదీ కాన్వాయ్‌లోకి ‘కదిలే కోట’.. రేంజ్ రోవర్ సెంటినెల్ ప్రత్యేకతలు ఇవే!
దేశ ప్రధానమంత్రి భద్రత అంటే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల్లో ఒకటి.
దేశ ప్రధానమంత్రి భద్రత అంటే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల్లో ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ ప్రత్యేక రక్షణ దళం (ఎస్.పీజీ) నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. అయితే ఈ భద్రత కేవలం సిబ్బందితోనే పూర్తికాదు. ప్రధాని ప్రయాణించే వాహనం కూడా అంతే అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో సిద్ధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రధాని కాన్వాయ్‌లో అత్యంత శక్తివంతమైన రేంజ్ రోవర్ సెంటినెల్ చేరింది. సాధారణ లగ్జరీ ఎస్.యూవీ గా కనిపించే ఈ వాహనం, నిజానికి శత్రువుల పాలిట ఒక కదిలే కోట అని చెప్పాలి. అత్యున్నత రక్షణ ప్రమాణాలు
ఈ ప్రత్యేక రక్షణ వాహనం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి వీఆర్8 బాలిస్టిక్ సర్టిఫికేషన్ పొందింది. దీని ప్రత్యేకతలు చూస్తే.. అత్యంత శక్తివంతమైన 7.62 ఎంఎం ఆర్మర్ పియర్సింగ్ బుల్లెట్లు సైతం ఈ వాహనం బాడీని లేదా అద్దాలను ఛేదించలేవు. బాంబు దాడులు, గ్రెనేడ్ పేలుళ్లు, భారీ షాక్‌వేవ్‌లను కూడా తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కారుకు కేవలం కొద్ది మీటర్ల దూరంలో సుమారు 15 కిలోల బరువైన టీఎన్.టీతో పేలుడు సంభవించినా, లోపల ఉన్నవారి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని తయారీ సంస్థ స్పష్టం చేసింది.
రసాయన దాడులు సైతం బేఖాతరు!
శత్రువులు ఒకవేళ రసాయన దాడులు లేదా ప్రాణహాని కలిగించే విషవాయువులను ప్రయోగించినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఇందుకోసం కారులో ప్రత్యేకమైన ఆక్సిజన్ సప్లై సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనితో పాటు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా 'ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్' ఇందులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయట ఉన్న భద్రతా సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా అత్యాధునిక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా అమర్చారు.
బరువు 4.4 టన్నులు.. కానీ వేగంలో కింగ్
భారీ బుల్లెట్ ప్రూఫ్ కవచాలు, ప్రత్యేక స్టీల్ నిర్మాణం కారణంగా ఈ ఎస్.యూవీ బరువు ఏకంగా 4.4 టన్నులకు పైగా ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ దీని పనితీరులో ఎలాంటి రాజీ లేదు.ఇందులో అమర్చిన 5.0 లీటర్ సూపర్‌చార్జ్డ్ వీ8 ఇంజిన్ 380 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 10.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 193 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ వాహనానికి ఉంది.
విలాసానికి మారుపేరు: ఇంటీరియర్ ఫీచర్లు
బయట నుంచి చూస్తే ఇది ఒక శక్తివంతమైన యుద్ధ వాహనంలా కనిపించినా లోపల మాత్రం అత్యంత విలాసవంతమైన లగ్జరీ క్యాబిన్ ఉంటుంది. ప్రధాని సుదీర్ఘ అధికారిక పర్యటనలు చేసినప్పుడు కూడా అలసట లేకుండా ఉండేలా దీని ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో అధునాతన టచ్ ప్రో డుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు 10 అంగుళాల హై-రెజల్యూషన్ టచ్‌స్క్రీన్‌లు, అత్యాధునిక క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు అత్యంత సౌకర్యవంతమైన సీట్లను అమర్చారు. భద్రతతో పాటు ప్రయాణ సౌకర్యానికి కూడా ఇందులో సమాన ప్రాధాన్యత లభించింది.
ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల అధినేతలు వినియోగించే అత్యున్నత భద్రతా వాహనాల్లో రేంజ్ రోవర్ సెంటినెల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఇది ప్రధాని మోదీ కాన్వాయ్‌లో చేరడంతో భారత అత్యున్నత భద్రతా ప్రమాణాలు మరింత బలపడ్డాయని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన రక్షణ వ్యవస్థలు, విలాసవంతమైన సౌకర్యాల కలయికతో రూపొందిన ఈ ఎస్.యూవీ నిజంగానే 'కదిలే కోట' అనే పేరుకు పూర్తి న్యాయం చేస్తోంది.