ప్రైవేట్‌కు పునాది.. ఇస్రోకు నష్టమా?.. భారత అంతరిక్ష రంగానికి కొత్త బలమా?
భారత అంతరిక్ష రంగంలో ఒక సరికొత్త సంచలనం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ విజయవంతమైన ప్రయోగంతో దేశీయ స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేట్ శకం అధికారికంగా ప్రారంభమైంది.
భారత అంతరిక్ష రంగంలో ఒక సరికొత్త సంచలనం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ విజయవంతమైన ప్రయోగంతో దేశీయ స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేట్ శకం అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇస్రో మాత్రమే మనకు గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం సొంతంగా రాకెట్లను తయారు చేసి, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగలవని భారత్ ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది.
అయితే ఈ పరిణామంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి రావడం వల్ల ఇస్రో ప్రాధాన్యత తగ్గిపోతుందా? ప్రభుత్వ సంస్థకు ఏమైనా నష్టం జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అంతరిక్ష నిపుణుల విశ్లేషణల ప్రకారం.. ఇది ఇస్రోకు నష్టం కాదు సరే కదా భారత అంతరిక్ష రంగానికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుంది.
ఇస్రోకు తగ్గుతున్న పనిభారం.. పెరగనున్న ఫోకస్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ శాటిలైట్స్, ముఖ్యంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇస్రో ఇప్పటివరకు తన విలువైన సమయాన్ని, వనరులను ఇలాంటి వాణిజ్య ప్రయోగాలపై కూడా కేటాయించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ సంస్థలు ఈ కమర్షియల్ లాంచ్‌ల బాధ్యతను పంచుకోవడం వల్ల ఇస్రోపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల ఇస్రో తన పూర్తి దృష్టిని దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన, క్లిష్టమైన ప్రాజెక్టులపై కేంద్రీకరించవచ్చు. గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష యాత్ర, తదుపరి చంద్రయాన్ మిషన్లు, మంగళయాన్ మార్స్ మిషన్, భారత సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం.. ఇలాంటి అత్యంత అధునాతన సాంకేతిక పరిశోధనలపై ఇస్రో దృష్టి పెట్టడం వల్ల దేశ కీర్తి మరింత పెరుగుతుంది.
ప్రభుత్వానికి ఆదాయం.. సాంకేతిక బదిలీ
ఇస్రో అభివృద్ధి చేసిన ఎన్నో పేటెంట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే ఇస్రో వందలాది టెక్నాలజీలను దేశీయ పరిశ్రమలకు అందించి అండగా నిలిచింది. ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.
ప్రైవేట్ కంపెనీల మధ్య పోటీ పెరగడం వల్ల రాకెట్ ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గుతుంది. అంతర్జాతీయ కంపెనీలు తక్కువ ఖర్చుతో కూడిన భారతీయ ప్రైవేట్ స్పేస్ సేవల వైపు మొగ్గు చూపుతాయి. ఈ రంగంలోకి వస్తున్న పెట్టుబడుల వల్ల వేలాది మంది యువ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఇది పోటీ కాదు.. సహకారం!
'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగం కేవలం ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు. ఇది భారత అంతరిక్ష రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి బలమైన పునాది వేసిన చారిత్రాత్మక ఘట్టం. ప్రైవేట్ రంగానికి ఇస్రో పోటీదారు కాదు.. ఒక మార్గదర్శి లాంటిది. ఇస్రో అందించే మద్దతుతో ప్రైవేట్ సంస్థలు దూసుకుపోతుంటే, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా రాబోయే రోజుల్లో ఊహించని స్థాయికి చేరడం ఖాయం.