సింగయ్య మృతిపై అనుమానాలు.. భార్య ‘సంచలన' ఆరోపణలు!

పర్యటన ముగిసిన రెండు రోజులుకు మాజీ సీఎం జగన్ కారు కిందే సింగయ్య పడిపోయిన దృశ్యాలతో వీడియో విడుదల చేశారు.;

Update: 2025-07-02 12:41 GMT

వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై తమకు అనుమానాలు ఉన్నట్లు ఆయన భార్య లూర్దు మేరి తెలిపారు. చిన్న చిన్న గాయాలకే ఆయన మరణించాడని తాము భావించడం లేదని, అంబులెన్స్ లో ఏదో జరిగిందని సందేహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం నుంచి ఈ కేసుపై తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆమె ఆరోపించారు. సుమారు 50 మంది లోకేశ్ అనుచరులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని, తాము చెప్పినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు. మేము కూడా మీ కులస్థులమేనంటూ కాగితాలపై ఏదో రాసి తమపై ఒత్తిడి చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు లూర్దా మేరి.

గత నెల 18న మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కాదని ఒకసారి, ఆయన కాన్వాయ్ లోని ప్రైవేటు కారు అంటూ మరోసారి పోలీసులు ప్రకటనలు చేశారు. పర్యటన ముగిసిన రెండు రోజులుకు మాజీ సీఎం జగన్ కారు కిందే సింగయ్య పడిపోయిన దృశ్యాలతో వీడియో విడుదల చేశారు. దీంతో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.

సుమారు 15 రోజులపాటు ఈ వివాదం కొనసాగగా, పోలీసులు ప్రమాదానికి కారణమైన జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న మాజీ సీఎం జగన్ తోపాటు మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ కేఎన్ఆర్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. దీనిపై మాజీ సీఎంతో సహా మిగిలిన నిందితులు హైకోర్టును ఆశ్రయించి తదుపరి చర్యలు తీసుకోకుండా ఉపశమనం పొందారు.

ఈ పరిస్థితుల్లో సింగయ్య మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య లూర్దామేరి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా తమపై టీడీపీ యువనేత లోకేశ్ అనుచరులు ఒత్తిడి చేశారని ఆమె చెబుతున్నారు. తమను మాజీ సీఎం జగన్ మాత్రమే ఆదుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News