కమలాపురం ఫిఫ్టీ - ఫిఫ్టీ.. మ్యాటర్ ఇదే... !
ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కమలాపురం. ఇది వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం.
ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కమలాపురం. ఇది వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. వైసీపీ అధినేత జగన్.. సొంత మేనమామ.. రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పుత్తా కృష్ణచైతన్య రెడ్డి విజయం దక్కించుకున్నారు. చైతన్యకు కూటమి వేవ్‌తో పాటు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆయనకు అండగా నిలిచింది. దీనికి తోడు రవీంద్రనాథ్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా.. పుత్తాకు కలిసి వచ్చింది. దీంతో ఆయన విజయం దక్కించుకున్నారు.
మరి రెండేళ్ల తర్వాత.. పుత్తా పరిస్థితి ఎలా ఉంది ? ఆయన నియోజకవర్గాన్ని ఎలా లీడ్ చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకత, కూటమి పార్టీల సానుకూలత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ సమయంలోనే పుత్తా కేవలం 25 వేల ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి.. ఎంత లేదన్నా.. స్థానిక ఎమ్మెల్యేపై అంతో ఇంతో వ్యతిరేకత పెరుగుతుంది. దీనిని తట్టుకుని నిలబడి విజయం దక్కించుకోవాలి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యేపై పెరిగే సానుభూతిని తగ్గించాలి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరించాలి. కానీ.. ఈ విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీగానే పుత్తా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట. ఆయన టైం పెట్టుకుని బయటకు వస్తు న్నారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు చేసే విషయంలోను.. రాజకీయంగా దూకుడు ప్రదర్శించే విషయంలోనూ పెద్దగా ఉత్సాహం చూపించలేక పోతున్నారని చెబుతున్నారు. ఇది.. తన మంచితనమని ఎమ్మెల్యే చెబుతున్నా.. అంతిమంగా ఆయనకు ఇబ్బందులు రావొచ్చని అంటున్నారు.
మరోవైపు.. కమలాపురం వైసీపీలో రాజకీయ జోరు పెరిగింది. రెడ్డి సామాజిక వర్గాన్ని చేరువ చేసుకునేందుకు.. తన మైనస్‌లు తెలుసుకుని సరిచేసుకునేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో బయటకు వస్తున్నారు. కార్యకర్తలతోనూ మమేకం అవుతున్నారు. గతంలో కొన్ని వర్గాలను దూరం పెట్టిన ఆయన.. ఇప్పుడు వారిని కలుపుకొని పోతున్నారు. సమస్యలు చెప్పండి.. పరిష్కరిస్తాం.. అంటూ ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసుకుని మరోసారి విజయం దక్కించుకోవాలంటే.. ఎమ్మెల్యే పుత్తా మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.