మావిగన్ ఓకే.. ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి సజ్జల?

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తెలుగునాట చాలా పార్టీలకు ఉండని ఒక ప్రత్యేక లక్షణం వైసీపీ సొంతంగా చెప్పాలి.;

Update: 2026-04-11 11:22 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తెలుగునాట చాలా పార్టీలకు ఉండని ఒక ప్రత్యేక లక్షణం వైసీపీ సొంతంగా చెప్పాలి. అధినేత టేకప్ చేసే ఏ అంశానికైనా సరే.. భిన్న వాదనలకు పోకుండా.. క్రమశిక్షణ కలిగిన సైనికుల మాదిరి వ్యవహరిస్తూ..అధినేత మాటకు వంతపాడే విషయంలో వైసీపీ వర్గీయులు మరెవరికీ సాటి రారనే చెప్పాలి. అదే మిగిలిన పార్టీలు అయితే.. అధినేత ఎంత చించుకున్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. వైసీపీలో మాత్రం ఇందుకు భిన్నమైన సీన్ కనిపిస్తుంటుంది.

తాజాగా మావిగన్ ఎపిసోడ్ నే తీసుకుంటే.. అమరావతిని శాశ్విత రాజధానిగా పార్లమెంట్ లో అత్యధికపార్టీలు ఓకే చెప్పి.. బిల్లును చట్టంగా మార్చేసి.. దానికి రాష్ట్రపతి రాజముద్ర వేసే ముందు మొదలు పెట్టిన మావిగన్ మాట.. రాజముద్ర పడి.. అమరావతి శాశ్వితమన్న మాటకు చెక్ పెట్టేలా.. జగన్ నోటి నుంచి వచ్చిన మావిగన్ మాటను.. వెనుకా ముందు చూసుకోకుండా వైసీపీ వర్గీయులు ఇప్పుడు భుజాన వేసుకొని వల్లె వేసుకుంటున్న పరిస్థితి.

వైసీపీ అధినేత కోరుకున్నది కోరుకున్నట్లుగా చేసేందుకు.. చెప్పేందుకు ఆయన్ను ఆపే వారెవరూ ఉండరు. కాకుంటే తాను మాట్లాడే మాటలు.. సమయానికి తగ్గట్లు సూట్ అవుతాయా? లేదా? అన్న ప్రశ్న కూడా ఆయన వేసుకోవటానికి ఇష్టపడరన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ.. అలాంటి తీరే ఉంటే.. మావిగన్ మాటే వచ్చేది కాదు. జగన్ తో మొదలైన మావిగన్ మాట.. వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మావిగన్ మాటకు తమ మద్దతు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి సైతం స్పందించారు. మావిగన్ గురించి చెప్పటమే కాదు.. జగన్ నోటి నుంచి ఇటీవల కాలంలో ఏమేం అంశాలు వచ్చాయో.. వాటిని మరోసారి తన మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు సజ్జల. తమ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మావిగన్.. అమరావతిలో పది శాతం ఖర్చుతో మరుసటి రోజే రాజధానిగా మారుతుందన్నారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్ పోర్టు. రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానమైంది. త్వరలో పోర్టు కూడా వస్తోందని.. జగన్ చెప్పేదానికి.. చంద్రబాబు చెప్పిన దానికి తేడా ఇదేనని వ్యాఖ్యానించారు.

ఇన్ని మాటలు చెబుతున్న సజ్జల.. వైఎస్ జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో మావిగన్ మాట ఎందుకు రాలేదు? ఒకవేళ.. ఇప్పుడు చెప్పే మాటలన్ని.. అప్పుడే చేసేసి ఉంటే.. మరోలాఉండేది కదా? చేతిలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట పాడి.. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త రాగాన్ని తీయటం దేనికి నిదర్శనం? ఇంతకూ ఇప్పుడు మాట్లాడుతున్న మావిగన్ సరే.. మరి.. మీ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చి.. భారీగా కసరత్తు చేసిన మూడు రాజధానుల మాటేమిటి? అన్నది అసలు ప్రశ్న. ముందు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి.. ఆ తర్వాత మావిగన్.. మావిగన్ అంటూ మాట్లాడే బాగుంటుందన్న విషయాన్ని సజ్జల గుర్తిస్తే మంచిది. ప్రత్యర్థుల్ని వేలెత్తి చూపే ముందు.. తమవైపు వేలెత్తి చూపుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగుంటుందన్నమాట వినిపిస్తోంది.

Tags:    

Similar News