బుర్రా వర్సెస్ మానుగుంట.. హీటెక్కిన పాలిటిక్స్ ..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. పాత కొత్త నేతల మధ్య రాజకీయాలు తీవ్రస్థాయిలో రగులుతున్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. పాత కొత్త నేతల మధ్య రాజకీయాలు తీవ్రస్థాయిలో రగులుతున్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో నాలుగు సార్లు విజయం దక్కించుకున్న మానుగుంట మహీధర్ రెడ్డి.. మరోసారి తన దూకుడు పెంచుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఆయనను పక్కన పెట్టింది. సర్వేల్లో మంచి మార్కులు రాలేదని చెబుతూ.. అసలు టికెట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే అప్పటి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు అవకాశం కల్పించారు. ఈయన గెలుస్తారని పార్టీ అంచనా వేసుకుంది. కానీ, కూటమి హవా కావొచ్చు.. వ్యక్తిగతంగా బుర్రాకు ఉన్న మైనస్‌లు కావొచ్చు.. మొత్తంగా బుర్రా ఓడిపోయారు. అయితే.. ఆయనను వైసీపీ తిరిగి ఇక్కడే ఇంచార్జ్‌గా నియమించింది. పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఈ క్రమంలో మానుగుంటను పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
అయితే.. రెండున్నరేళ్లు గడిచినా.. బుర్రా కీలక కార్యక్రమాలు ఏవీ చేపట్టడం లేదు. పార్టీనాయకులతోనూ ఆయన చర్చలు జరపడం లేదు. తన వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకుంటున్నారు. తాను 2019లో విజయం దక్కించుకున్న నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.దీంతో కందుకూరులో వైసీపీ రాజకీయాలు చప్పగా సాగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో మానుగుంట ముందుకు వచ్చారు. పార్టీ తరఫున కార్యక్రమాలు పక్కన పెట్టి.. వ్యక్తిగతంగా తన అనుచరులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
తన హవా ఇదీ.. అని పార్టీకి తెలిసేలా.. వరుసగా అనుచరులతో సమావేశాలు పెడుతున్నారు. ఇదే సమ యంలో కీలక అనుచరులతో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. దీంతో బుర్రా అవాక్కవుతున్నారు. మరోవైపు బుర్రా కు నిన్న మొన్నటి వరకు అండగా ఉన్న కొందరు నాయకులు కూడా ఇప్పుడు మానుగుంటకు అనుకూలంగా మారిపోయారు. దీంతో కందుకూరులో మానుగుంట హవా మరోసారి పుంజుకుంది.
దీనిని బుర్రా చూస్తూ.. ఊరుకున్నారా? అంటే అది కూడా లేదు. పార్టీకి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. వ్యక్తిగతంగా ముందు తన ఇమేజ్‌ను పెంచుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే.. ఇండిపెండెంటుగా అయినా పోటీకి మానుగుంట రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి దీనిని వైసీపీ ఎలా చూస్తుంది? తిరిగి మానుగుంటకే పగ్గాలు అప్పగిస్తుందా? లేదా? అనేది చూడాలి.