ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?
| మొత్తం మీద కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒక విషయంలో విజయం సాధించారు.
మొత్తం మీద కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒక విషయంలో విజయం సాధించారు. ప్రధాని కాలేకపోయిన ఆయన విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి బలమైన ప్రతిపక్ష నాయకుడుగా మారారు. అది తాజాగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. రాహుల్ నాయకత్వం మీద మొదట్లో సందేహాలు వ్యక్తం చేసిన పార్టీలు కూడా భుజం కలిపి నడిచాయి. అంతా కలసి ఐక్యతను చాటాయి. దాంతో రాహుల్ కేంద్ర బిందువుగా మారారు. ఇక ఉత్తరాదిలో యూపీ నుంచి సమాజ్ వాది పార్టీతో కాంగ్రెస్ కి దోస్తీ ఉంది. అలాగే బీహార్ లో ఆర్జేడీతో పొత్తు ఉంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమి తరువాత కాంగ్రెస్ తో మరింత సాన్నిహిత్యం నెరపుతున్నారు. మహారాష్ట్రలో ఉద్ద్ధవ్ ఠాక్రే శివసేన మరో వైపు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీతో చెలిమి చేస్తూ బలంగానే ఉంది. గుజరాత్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఢిల్లీ పంజాబ్ వంటి చోట్ల కాంగ్రెస్ బలంగానే ఉంటూ తన పోరాటం సొంతంగా సాగిస్తోంది.
దక్షిణాదిన కొత్త స్నేహాలు :
ఇక దక్షిణాదిన మొదటి నుంచి కాంగ్రెస్ బలంగానే ఉంది. కర్ణాటక తెలంగాణాలలో సొంతంగానే అధికారంలోకి వచ్చింది. కేరళలో ఇటీవల పవర్ ని అందుకుంది. తమిళనాడులో ఆరు దశాబ్దాల తరువాత ప్రభుత్వంలో చేరింది. రెండు మంత్రి పదవులు కూడా తీసుకుంది. సినీ దళపతి విజయ్ స్థాపించిన టీవీకేతో కొత్త స్నేహం నెరిపి దక్షిణాదిన అయిదింట నాలుగు రాష్ట్రాలలో తన హవాను స్పష్టం చేస్తోంది. అన్నీ బాగానే ఉన్నా మొదటి నుంచి కాంగ్రెస్ కి పెట్టని కోటగా ఉన్న ఏపీని ఎందుకు వదిలేస్తోంది అన్నదే చర్చగా ఉంది. దేశంలో ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఉద్యమిస్తున్నారు. మరి ఏపీలో కూడా ఈ ఉద్యమాన్ని ఎత్తుకుని అక్కడ విపక్ష భూమికను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళే చాన్స్ ని ఎందుకు వదిలేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది.
ఉనికి చాటుకోలేక :
ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నాయి. అన్ని పార్టీలు తమ శక్తి మేరకు బరిలో నిలబడి తలపడుతున్నాయి. ఇండిపెండెంట్లు కూడా అనేక చోట్ల జాతకాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాంటిది కాంగ్రెస్ అయితే ఎందుకో ఇంతటి సువర్ణ అవకాశాన్ని వదిలేసుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ కి గత మూడు ఎన్నికలూ దెబ్బేశాయి. డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు అంటారు. అలాంటిది ఏపీలో అధికార కూటమి విపక్ష వైసీపీలకే రాజకీయ మైదానం వదిలేసి కాంగ్రెస్ ఇంకా వేచి చూసే ధోరణిలో ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.
విస్తరణకు కొత్త ఆలోచనలు:
వామపక్షాలను ఇతర పాటీలని కలుపుకుని ఫ్రంట్ గా కట్టి ముందుకు సాగితే స్థానిక ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు అయినా దక్కుతాయని కదా అని అంటున్నారు. ఒక వేళ అలా కాకపోయినా కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని చాటుకునే విధంగా ఉండేది కదా అని కూడా అంటున్నారు. అయితే ఏపీ మీద మాత్రం కాంగ్రెస్ కి సరైన ప్లాన్స్ ఉన్నాయా లేవా అన్నదే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్డీయే బలంగా ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది.
జగన్ ని కలుపుకుంటే:
దాంతో కాంగ్రెస్ ఇక్కడ తన రాజకీయ విస్తరణకు కొత్త ఆలోచనలు చేయాల్సి ఉంది. దక్షిణాదిన అంతటా తన హవా ఉన్న కాంగ్రెస్ కి ఏపీలో ఆ పలుకుబడిని ఉపయోగించి ఎంతో కొంత ఎదగడం కష్టం కాదని అంటున్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడమే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఏపీలో జగన్ ని కలుపుకుంటే ఇండియా కూటమికి దక్షిణాదిన మరింత బలం వస్తుందని అంటున్నారు. అయితే జగన్ వద్దు అన్నదే కాంగ్రెస్ ఆలోచనగా ఉందా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడం కోసం రాహుల్ ప్లాన్ ఏంటి అన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు.