ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !
| ఓటు అన్నది పవిత్ర బాధ్యత అంటారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి అని అంటారు.
ఓటు అన్నది పవిత్ర బాధ్యత అంటారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి అని అంటారు. ఓటు కోసం సమయం వెచ్చించలేరా అని కూడా మేధావుల నుంచి అంతా చెబుతారు. కానీ అదే ఓటు నగరాలలో పక్క ఉన్న పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటేయడానికి నగరవాసులకు బద్ధకంగా తోస్తుంది. కానీ గిరిజన గ్రామాలు అనేకం ఈ రోజుకీ పదుల కిలోమీటర్లు వచ్చి మరీ ఓటేస్తున్నాయి. అయితే ఈ విధంగా ఓటేయడానికి తమ కూలీని డబ్బులను శ్రమను మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్ళు దాటుతోంది కానీ ఈ రోజుకీ గిరిజనులు మౌలిక సదుపాయాలకు దూరంగానే ఉండిపోతున్నారు. ఆఖరుకు ఓటు వేయాలంటే కూడా ఎంతో శ్రమకు ఓర్చి వెళ్లాల్సి వస్తోంది.
అచ్చంగా అరవై కిలోమీటర్లు :
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ రోకటి తిమ్మాపురం గ్రామస్థులకు ఓటు వేయాలని తమ హక్కుని బాధ్యతను చాటుకోవాలని ఉంటుంది. కానీ వారు ఓటు వేయాలంటే ఏకంగా అరవై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అదే వారికి ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా ఉంటోంది. తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటేసి గెలిపించుకోవాలని ఆ గ్రామానికి చెందిన గిరిజనులకు ఉంటుంది. కానీ ఓటేయడమే కష్టం అంటున్నారు. రోకటి తిమ్మాపురం గ్రామంలో మొత్తం నలభై గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా ఓటేసేందుకు విజయనగరం జిల్లా బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాలను దాటుకుని అల్లూరి జిల్లాలోని రొంపిల్లి వెళ్లాల్సిందే. మొత్తం వంద ఓట్ల దాకా ఇక్కడ ఉన్నాయి. ఓటేసేందుకు ప్రతీ ఒక్కరికీ కనీసంగా 400 రూపాయలు ప్రయాణం ఖర్చులకు అవుతోంది అని ఈ గిరిజనం వాపోతున్నారు. తీరా అష్టకష్టాలు పడి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటే అప్పటికే తమ ఓటు ఎవరో వేసేస్తున్నారు అని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు.
వారి అవస్థలు అంతే :
ఇదే అల్లూరి జిల్లాలో కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ జాలుల బంధ గ్రామంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ముప్పై దాకా గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఎనభై దాకా ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ ఓటర్లు అంతా ఓటేయాలి అంటే అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట, గొలుగొండ మండలాలను దాటుకుని మూలపేట పంచాయతీ కేంద్రానికి వెళ్ళాల్సి వస్తోంది. వారు ఉంటున్న జాజుల బండ గ్రామానికి ఈ మూలపేటకు మధ్య ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా ఈ రెండు గ్రామాల ఓటర్లు డోలీలు కట్టుకుని కొంత దూరం ఆ తరువాత ప్రత్యేకంగా వాహనాలు మాట్లాడుకుని మరి కొంత దూరం, మరి కొంత దూరం నడచి ఇలా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటేయాల్సి వస్తోంది అని అంటున్నారు.
పరిషత్ ఎన్నికల కోసం :
ఇక ఈ గిరిజన గ్రామస్తులు అంతా పరిషత్తు ఎన్నికల కోసం అలాగే పంచాయతీ ఎన్నికల కోసం రెండు సార్లు ఇలా కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాలని అంటున్నారు. తమకు సరైన సదుపాయాలు లేవని తాము ఓటు వేయాలని ఉన్నా వేయడానికి రెండు రోజుల పాటు కష్టించాల్సి వస్తోందని వీరు చెబుతున్న మాటలు పడుతున్న ఆవేదన అన్నీ విన్నాక కన్నాక వారి కోసం ఏమైనా ఆల్టర్నేషన్ మార్గాలు ఆలోచిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఒక్క ఓటు కోసం కూడా అడవిలో పోలింగ్ బూతులను పెడుతున్న ఎన్నికల సంఘాలు దాదాపుగా రెండు వందల ఓటర్లు ఉన్న ఈ గ్రామల కోసం ఏమైనా చేస్తే ప్రజాస్వామ్యానికి సార్థకత ఉంటుందని వారి పేరున దొంగ ఓట్లు వేసుకునే వారిని కట్టడి చేసినట్లు అవుతుందని అంటున్నారు.