మరో ఎస్టీ సీటు మీద జనసేన కర్చీఫ్ !
ఏపీలో టీడీపీలో కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన తన రాజకీయ విస్తరణకు అనువైన రాజకీయ క్షేత్రాలను ఎంచుకుంటోంది.
ఏపీలో టీడీపీలో కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన తన రాజకీయ విస్తరణకు అనువైన రాజకీయ క్షేత్రాలను ఎంచుకుంటోంది. ఈ విషయంలో ఒకింత ఇబ్బంది లేకుండానే వ్యవహరిస్తోంది. టీడీపీకి బలం ఉన్న చోట కాకుండా వైసీపీకి గట్టి పట్టు ఉన్న చోటనే గురి పెడుతోంది. దాని వల్ల జనసేన విస్తరణ సాఫీగా సాగుతుందని మిత్రులకు ఏ రకమైన సమస్యలు రావని అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్రాలో గిరిజన అసెంబ్లీ సీట్లు ఏడు దాకా ఉన్నాయి. వీటిలో ఎపుడూ వైసీపీ గెలుస్తూ వస్తోంది. కానీ తొలిసారి 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇంతటి కూటమి ప్రభంజనంలోనూ వైసీపీకి అరకు పాడేరు అన్న రెండు ఎస్టీ సీట్లు దక్కాయి. అలా వైసీపీ పరువు నిలిచింది. అయితే ఈ రెండింటినీ జనసేన అధికారంలో భాగస్వామ్యం అయ్యాక పూర్తిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
తరచూ పవన్ పర్యటనలు :
అరకు పాడేరులలో తరచూ పవన్ పర్యటనలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన గిరిజన ప్రాంతాలలో రహదారులు మంజూరు చేశారు. గిరిజనులతో నేరుగా మమేకం అవుతూ వచ్చారు. అంతే కాదు అల్లూరి జిల్లాకు జనసేన తరఫున పరిశీలకుడిగా నాగేంద్రబాబుని నియమించడం వెనక కూడా అక్కడ నిలిచి గెలవాలన్న పక్కా ప్లాన్ ఉందని అర్ధం అవుతోంది. ఇక మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో ఎస్టీ సీట్లలో జనసేన తొలి అడుగు పడింది. 2024 ఎన్నికల్లో పాలకొండ సీటుని తీసుకుని జనసేన అక్కడ గెలిచింది. నిమ్మక జయకృష్ణ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు మరో ఎస్టీ సీటు కురుపాం మీద జెండా పాతాలని జనసేన చూస్తోంది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలను వినియోగించుకోవాలని ప్రణాళికను రూపొందిస్తోంది.
పోటీకి సిద్ధమంటూ :
మరో వైపు చూస్తే టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన నిమ్మక జయరాజ్ జనసేనలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కురుపాం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయన పార్టీ సమావేశం నిర్వహించారు. మొత్తం సీట్లను కూటమి గెలుచుకోవాలని క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. ఇక ఇక్కడ తమ వాటాగా ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసేన చూస్తోంది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కురుపాం నియోజకవర్గంలో సర్పంచులలో తాము ఎక్కువగా తీసుకుని బలపడాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.
భారీగానే సీట్లు :
ఇక కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం అయిదు మండలాలు ఉన్నాయి. అవి కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలసగా ఉన్నాయి. అలాగే ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం చొప్పున మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఆయా మండలాల నుండి జెడ్పీటీసీ సభ్యులు ఎన్నికవుతారు. ఈ ఐదు మండలాల పరిధిలో కలిపి సుమారు 70 నుంచి 80 వరకు ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. కురుపాం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 130 కి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇలా పెద్ద ఎత్తున అయితే జనసేన క్యాడర్ కి నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు దక్కితే రేపటి రోజున ఈ సీటుని తమకు పొత్తులో కేటాయించాలని కోరే అవకాశాలు ఉంటాయని జనసేన నేతలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి టీడీపీ తరఫున తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కురుపాం సంస్థానాధీశులు వైరిచర్ల వారసులు కూడా టీడీపీలో చురుకుగా ఉన్నారు. అయితే పొత్తులో ఈ సీటు జనసేన కోరి తీసుకుంటుంది, 2029 లో పోటీ చేస్తుందని అంటున్నారు. దానికి ముందస్తు ప్రయత్నంగా స్థానిక సంస్థలలో తమ వాటాను పెంచుకోవాలని చూస్తోంది అని చెబుతున్నారు.