బీజేపీ మాధవ్ కి బిగ్ టెస్ట్...కూటమితో అయ్యేనా ?

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఏపీలో తమ పార్టీ గురించి తెలియదని కాదు, అన్నీ తెలిసినా రాజకీయాల్లో ఇంకా ఏదో ఆశిస్తారు. తమకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు రావాలని కోరుకుంటారు.

Update: 2026-09-12 02:22 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఏపీలో తమ పార్టీ గురించి తెలియదని కాదు, అన్నీ తెలిసినా రాజకీయాల్లో ఇంకా ఏదో ఆశిస్తారు. తమకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు రావాలని కోరుకుంటారు. అలా కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే ఏపీ పర్యటనకు తొలిసారి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని దిశా నిర్దేశం చేశారని చెబుతున్నారు. బీజేపీ ప్రభావం ప్రతీ చోటా కనిపించాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో ఏపీ బీజేపీకి లోకల్ బాడీ టెన్షన్ స్టార్ట్ అయింది.

క్యాడర్ నుంచి ఒత్తిడి :

అంతే కాదు పార్టీలో ఉన్న నాయకులు క్యాడర్ నుంచి అయితే ఒత్తిడి ఎక్కువగా ఉంది. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు, అలాగే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. వీరి అనుచరుల నుంచి ఒత్తిడి అయితే ఎక్కువగా వస్తోంది అని అంటున్నారు. పార్టీగా బీజేపీ స్థానిక ఎన్నికల్లో పెద్దగా రాజకీయ ప్రదర్శన చేసిన అనుభవాలు అయితే గతంలో లేవు. కానీ ఇపుడు కూటమిలో ఉంది. పైగా పొత్తులు గట్టిగా ఉన్నాయి. సీట్లు తీసుకోవాలే కానీ విజయం దాదాపుగా తధ్యం. దాంతో బీజేపీలో కూడా ఆశావహులు ఎక్కువైపోతున్నారు. కూటమి నుంచి వీలైనంత వరకూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. దాంతో పొత్తులో భాగంగా అధికంగా సీటు కోరాలని డిమాండ్ పెడుతున్నారు.

బలం ఉంటేనే అంటూ :

ఇక చూస్తే కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. ఆ పార్టీకి బూత్ లెవెల్ వరకూ పార్టీ నేతలు ఉన్నారు. అంతా బలంగా ఉన్నారు. ఇక కూటమిలో రెండవ ప్లేస్ లో జనసేన ఉంది. ఆ పార్టీకి కొన్ని ప్రాంతాలలో బలం అధికంగా ఉంది. ఈ రెండు పార్టీల తరువాతనే బీజేపీని చూస్తారు. ఇక ఈ మధ్యనే వచ్చిన ఒక ప్రచారం బట్టి చూస్తే బీజేపీకి అయిదు శాతం సీట్లు సర్దుబాటు చేస్తారు అని అంటున్నారు. మరి మేయర్లు, జెడ్పీ చైర్మన్లు బీజేపీకి ఈ అయిదు శాతంలో దక్కుతాయా అంటే చూడాల్సి ఉంది. కేవలం అయిదు శాతం అంటే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కొన్ని జెడ్పీటీసీలతో సరిపెడతారా అన్న డౌట్ కూడా కాషాయ దళంలో వస్తోంది అని అంటున్నారు. తాము కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన చైర్మన్ పదవులు తీసుకుని పాలించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. బలం ఉంటేనే సీట్లు అని చెబుతున్న వేళ బీజేపీకి ఎక్కువ సీట్లు కానీ అలాగే పీఠాలు కానీ దక్కే చాన్స్ ఏ మేరకు అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది అంటున్నారు.

సత్తా చూపాల్సిందే :

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఆయన నియమితులు అయి ఏడాది ఈ మధ్యనే అయింది. ఆయన సారథ్యంలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటోంది. దాని కంటే ముందు పురంధేశ్వరి సారధ్యంలో బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను గెలిచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇపుడు అదే నిష్పత్తిలో అంతకంటే ఎక్కువగా కూడా మాధవ్ సత్తా చూపాల్సి ఉంది అని అంటున్నారు. మాధవ్ అయితే ఈ విషయంలో కూటమి పెద్దలతో చర్చించి బీజేపీకి సానుకూలం చేయాల్సి ఉందని అంటున్నారు. మరి అది సాధ్యపడుతుందా లేదా అన్నది చూడాలి. ఒక విధంగా అధిక సీట్లు సాధించినా గ్రౌండ్ లెవెల్ లో కూటమి పార్టీల మధ్య కో ఆర్డినేషన్ ఉండేలా చూసుకుంటేనే విజయం దక్కుతుంది. లేకపోతే ప్రత్యర్ధి వైసీపీ కాచుకుని ఉంటుంది. దాంతో మాధవ్ కి ఇది అగ్ని పరీక్ష గా మారుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News