లోకేశ్ చేతికి వైసీపీ మీడియా!! పెద్ద చానల్ పై బిగ్ డీల్

గతంలో ఒక మీడియా చానల్ ను నడిపిన ఆయన కొన్నాళ్లుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఇప్పుడు మళ్లీ మీడియా రంగంలోకి ఆయన వెళ్లడం వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Update: 2026-09-11 16:48 GMT

అగ్రశ్రేణి తెలుగు మీడియా చానల్ పై పెద్ద డీల్ కుదిరిందనే వార్త మీడియా సర్కిల్స్ ను ఊపేస్తోంది. రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఈ సమాచారంతో మంత్రి లోకేశ్ చేతికి పెద్ద చానల్ చేరిందని అంటున్నారు. ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆ మీడియాను బ్యాన్ చేశారని, కానీ రెండు రోజుల క్రితం ఈ పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్న ఒక సీనియర్ పాత్రికేయుడు ప్రముఖ టీవీ చానల్ ఎడిటోరియల్ బృందంలో కీలక బాధ్యతలు తీసుకున్నారని అంటున్నారు. గతంలో ఒక మీడియా చానల్ ను నడిపిన ఆయన కొన్నాళ్లుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఇప్పుడు మళ్లీ మీడియా రంగంలోకి ఆయన వెళ్లడం వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

సీనియర్ పాత్రికేయుడు ఎంట్రీతో ప్రముఖ చానల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి మీడియా చానల్ గా ఆ మీడియా నెట్ వర్క్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ సంస్థ యాజమాన్యం కారణంగా గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదరు మీడియా చానల్ వ్యవహారశైలిని బహిరంగంగా తప్పుపట్టేవారు. వైసీపీకి కొమ్ముకాస్తుందని విమర్శలు చేయడంతోపాటు తాను అధికారంలోకి వస్తే సంగతి చూస్తానని హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆ మీడియా సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆ సంస్థలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సన్నిహితుడు ప్రవేశించారని, ఇకపై ఆ సంస్థ ప్రసారాలు అన్నీ ఆయన చెప్పినట్లుగానే ఉండనున్నాయని అంటున్నారు. దీంతో సదరు మీడియాలో ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా ప్రసారమైన కథనాలు ఇకపై కొనసాగే పరిస్థితి ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు రాస్తున్నారు. అంటే ఇప్పటివరకు వైసీపీ మీడియాగా కొనసాగిన చానల్ ఇక నుంచి టీడీపీ మీడియా పూర్తిగా రంగు మార్చుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా సదరు మీడియా చానల్ లోగోను కూడా పసుపు వర్ణంలోకి మార్చుతూ కొందరు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. మీడియా రంగంలో ఇది ఒక పెద్ద మార్పుగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా అంటూ ఇంతకాలం దుమ్మెత్తిపోసిన టీడీపీ సోషల్ మీడియా కూడా ఈ ప్రచారంపై స్పందించకపోవడం విశేషంగా చెబుతున్నారు. దీనిని బట్టి పెద్ద డీల్ కుదిరినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామంతో వైసీపీ చానల్ టీడీపీ చానల్ గా మారిపోవడం ఖాయమంటున్నారు. అంతేకాకుండా సదరు మీడియా చానల్ యాజమాన్యానికి అనుబంధంగా ఉన్న మరో ప్రముఖ చానల్ తోపాటు ఇతర వ్యాపార సంస్థలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయని కూడా ప్రచారం చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రముఖ చానల్ మేనేజ్మెంట్ లోకి మంత్రి లోకేశ్ సన్నిహితుడు ఎంట్రీ ఇచ్చాడనే సమాచారం విస్తృత చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News