కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్..? త్వరలో కీలక మార్పులు

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించిందని ప్రచారం జరుగుతోంది.

Update: 2026-09-11 15:30 GMT

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించిందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు తగినట్లుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ముందుగా సమర్థులు అయిన కార్యదర్శులను నియమించుకోవాలని రాహుల్ చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. తన ఆలోచనలకు తగినట్లుగా పనిచేసేవారి కోసం జల్లెడ పడుతున్న ఆయన ఇప్పటికే కొందరిని ఇంటర్వ్యూ చేశారని అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న కీలక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని రాహుల్ భావిస్తున్నారని చెబుతున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాదిలోని పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ నేరుగా బీజేపీతో తలపడనుందని చెబుతున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో మిత్రపక్షం సమాజ్ వాది పార్టీతో పొత్తు ఉంటుందని అంటున్నారు. 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి సమాజ్ వాది పార్టీతో కలిసి అధికారంలోకి రావాలని రాహుల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన పంజాబ్ ను తిరిగి కైవసం చేసుకోవడంతోపాటు ఉత్తరాఖండ్ లో మళ్లీ మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా వ్యూహరచన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సూచిస్తున్నారు.

ఈ ప్రణాళికకు అనుగుణంగా సమర్థులైన కార్యదర్శులను నియమించుకోవడంతోపాటు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చేఏడాది పదవీ విరమణ చేయనున్న మల్లికార్జున ఖర్గే స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను నియమించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఖర్గే వయసు ఎక్కువ కావడంతో ఆయన స్థానంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ఇంచార్జులుగా ఉన్న నేతలను తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

దక్షిణాదికి చెందిన కేసీ వేణుగోపాల్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలనే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీలో వాడివేడి చర్చకు దారితీస్తోంది. కేరళం రాష్ట్రానికి చెందిన కేసీ వేణుగోపాల్ అగ్రనేత రాహుల్ కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళం ముఖ్యమంత్రి పదవిని ఆశించిన ఆయన రాహుల్ సూచనలతో వెనక్కి తగ్గారు. దీంతో అగ్రనేతకు మరింత దగ్గరయ్యారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్గే స్థానంలో కేసీ వేణుగోపాల్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మూడు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఈ కారణం కూడా దక్షిణాదికి చెందిన ఖర్గే పదవీ విరమణ తర్వాత అదే ప్రాంతానికి చెందిన కేసీ వేణుగోపాల్ కు బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా మార్పు తీసుకువచ్చే ప్రయత్నలు శరవేగంగా జరుగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News