80s ఏఐ ఫొటో ట్రెండ్: సరదా వెనుక డిజిటల్ ప్రైవసీకి ముప్పు.. అసలు ఏం జరుగుతోందో తెలుసా?
సరదాగా నాస్టాల్జిక్‌గా అనిపిస్తున్న ఈ ట్రెండ్‌ను అనుసరించడానికి లక్షలాది మంది చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు తమ వ్యక్తిగత సెల్ఫీలను అప్‌లోడ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రస్తుతం ‘80s రెట్రో ట్రెండ్’ తుఫానులా దూసుకుపోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఎక్కడ చూసినా నెటిజన్లు 1980ల కాలం నాటి పాతకాలపు దుస్తులు, వింటేజ్ హెయిర్‌స్టైల్స్, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్స్‌తో ఉన్న తమ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. సరదాగా నాస్టాల్జిక్‌గా అనిపిస్తున్న ఈ ట్రెండ్‌ను అనుసరించడానికి లక్షలాది మంది చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు తమ వ్యక్తిగత సెల్ఫీలను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న సరదా వెనుక మీ డిజిటల్ ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.
మీ ఫొటో కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు
ఏఐ టూల్‌కు మీ ఫొటోను అప్‌లోడ్ చేసినప్పుడు అది కేవలం ఒక సాధారణ ఇమేజ్‌గా మాత్రమే మిగిలిపోదు. ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా మీ ముఖ ఆకృతి, కళ్లు, ముక్కు , పెదవుల స్థానాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటా విశ్లేషించబడుతుంది. ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఈ సమాచారాన్ని బయోమెట్రిక్ డేటాగా నిల్వ చేస్తాయా లేదా అనేది ఆయా సంస్థల ప్రైవసీ పాలసీలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది వినియోగదారులు నిబంధనలు చదవకుండానే ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ తమ వ్యక్తిగత డేటాను మూడో వ్యక్తి చేతుల్లో పెడుతున్నారు.
డీప్‌ఫేక్‌లు, పర్యావరణ భారం
డిజిటల్ ప్రపంచంలో ఒకసారి వ్యాపించిన ఫొటోలను నియంత్రించడం చాలా కష్టం. ఈ ఫొటోలను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు లేదా నకిలీ చిత్రాలను రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఏఐ ఫొటో జనరేషన్ వల్ల పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక ఏఐ ఫొటోను జనరేట్ చేయడానికి సగటున 3 వాట్-అవర్స్ విద్యుత్ అవసరమవుతుందని అంచనా. ఏఐ డేటా సెంటర్లను చల్లబరిచేందుకు వేలాది లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. జీపీటీ-3 శిక్షణ , ఏఐ ప్రాంప్ట్‌ల వినియోగానికి భారీ మొత్తంలో నీరు ఖర్చవుతోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
80s ట్రెండ్‌ను ఎంజాయ్ చేయడం తప్పు కాదు.. కానీ భద్రత అంతకంటే ముఖ్యం. ఏఐ టూల్స్ ఉపయోగించే ముందు జాగ్రత్తలు పాటించండి. మీరు ఉపయోగిస్తున్న యాప్ యొక్క ప్రైవసీ పాలసీ ని ఖచ్చితంగా పరిశీలించండి. అప్‌లోడ్ చేసిన ఫొటోలు సర్వర్లలో ఎంతకాలం నిల్వ ఉంటాయో తెలుసుకోండి. థర్డ్-పార్టీ యాప్‌లకు అనవసరమైన అనుమతులు ఇవ్వకండి.
‘జనరేట్’ బటన్ నొక్కే ముందు మీ ప్రైవసీ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ట్రెండ్‌లో భాగం అవ్వండి. కానీ మీ డేటాను పణంగా పెట్టకండి.